L&T Metro | మెట్రో భారం మీరు మోయండి: కేంద్రానికి ఎల్ ఆండ్ టీ లేఖ
హైదరాబాద్ మెట్రో నష్టాలతో లాభం లేదని ఎల్ అండ్ టీ కేంద్రానికి లేఖ రాసి నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వాలే మోయాలని ప్రతిపాదించింది.

విధాత, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోను వదిలించేందుకు ఎల్ ఆండ్ టీ(L&T) తాజాగా మరో ప్రయత్నం చేస్తోంది. మెట్రో నిర్వహణ భారం అవుతుందని కేంద్రానికి ఎల్ ఆండ్ టీ లేఖ రాసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామంటు ప్రతిపాదించింది. ప్రాజెక్టు కోసం భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఆర్థిక లాభాలు అనుకున్న స్థాయిలో లభించడం లేదని కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని లేఖలో కోరింది. వరుస నష్టాలతో పేరుకుపోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా మెట్రోను నడపలేమని పేర్కొంది. యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా సరే ఆదాయం సరిపోవడం లేదని లేఖలో నివేదించింది.
ఆర్థిక అంచనాలను అందుకోలేక మెట్రో అవస్థలు
ప్రతిరోజూ 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్న హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు పూర్తిగా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(Public-Private Partnership) (పీపీపీ) మోడల్‌లో నడుస్తోంది. ఇందులో ప్రభుత్వాలు భూసేకరణ, అనుమతులు, పాలసీ మద్దతు వంటి సహకారం అందించాయి. కానీ ఆర్థికపరంగా మొత్తం బాధ్యత ఎల్ ఆండ్ టీ సంస్థదే. హైదరాబాద్ మెట్రోను(Hyderabad Metro) నిర్మించడానికి ఎల్ ఆండ్ టీ సుమారు రూ. 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడి పెట్టింది. ప్రాజెక్టు ప్రారంభ దశలో మంచి ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేసింది. రోజుకు 10–12 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేసినా…ఇప్పటికీ 5నుంచి 6 లక్షల మందికి మించి ప్రయాణికుల సంఖ్య దాటడం లేదు. కోవిడ్ సమయంలో ప్రయాణికుల సంఖ్య తీవ్రంగా పడిపోయింది. ఆనాటి ఆర్థిక కష్టాల నుంచి మెట్రో ఇంకా పూర్తిగా కోలుకోలేక పోతుంది. నిర్వహణ ఖర్చులు ఎక్కువవ్వడం..సిబ్బందికి వేతనాలు, విద్యుత్తు ఖర్చులతో పాటు ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులు, వాటిపై వడ్డీలు పెరిగిపోవడంతో మెట్రో నిర్వహణ తమకు గుదిబండ అని ఎల్ ఆండ్ టీ భావిస్తుంది. గతంలో పలుమార్లు తమ వాటా అమ్మకానికి ప్రతిపాదనలు పెట్టింది. కానీ ప్రభుత్వాలు అనుమతించలేదు. నష్టాలు పేరుకుపోతూండటం.. కేంద్ర, రాష్ట్రాలు కనీస సాయం చేసే ఆలోచన చేయకపోవడంతో.. నిర్వహణ నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తోంది. తాజాగా హైదరాబాద్ మెట్రో నిర్వహణ భారం అవుతుందని కేంద్రానికి ఎల్ అండ్ టీ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
ఎస్ పీవో తోనే మనుగడ
మెట్రో నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్ పీవీ) ఏర్పాటు చేసి దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే ఎల్ ఆండ్ టీ భాగస్వాములుగా ఉండాలని ఆ సంస్థ ఆశిస్తుంది. ముంబై మెట్రోకు ఇలాంటి సమస్యలే వస్తే.. ఆ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని రూ. 820 కోట్లకు చొప్పున మూడున్నర వేల కోట్లకు ఆర్బీఐతో కొనిపించి గట్టెక్కిస్తున్నారని..అలాగే తమకూ ఏదో ఒకటి చేయాలని ఎల్ అండ్ టీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
నిర్వహణను ప్రభుత్వాలు స్వీకరించినట్లయితే ఆర్థిక మద్దతు లభిస్తుంది. లాభాల కంటే ముఖ్యంగా ప్రజా సేవలకు ప్రాముఖ్యత నెలకొని..సర్వీస్ విస్తరణ పెరిగి..భవిష్యత్‌లో కొత్త కారిడార్లు, లింకులు సులభంగా నిర్మించే అవకాశముంటుందని భావిస్తున్నారు. అలాగే ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ ల మధ్య అనుసంధాన వ్యవస్థను మెరుగు పరిచి. స్మార్ట్ కార్డ్, మొబైల్ యాప్‌లు, డిజిటల్ టికెటింగ్ ద్వారా సౌకర్యాన్ని పెంచాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆదాయ వనరుల విస్తరణకు టికెట్ ధరల కంటే, ప్రకటనలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, కమర్షియల్ స్పేస్‌ల ద్వారా ప్రయత్నించాలన్న సూచనలు ఉన్నాయి.