Ponnam Prabhakar| రోడ్డెక్కిన 65కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..జెండా ఊపిన మంత్రి పొన్నం

తెలంగాణ ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన 65 ఎలక్ట్రిక్ బస్సులు గురువారం నుంచి ప్రజారవాణ సేవలో రోడ్డెక్కేశాయి. రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 65 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

Ponnam Prabhakar| రోడ్డెక్కిన 65కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..జెండా ఊపిన మంత్రి పొన్నం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన 65 ఎలక్ట్రిక్ బస్సులు గురువారం నుంచి ప్రజారవాణ సేవలో రోడ్డెక్కేశాయి. రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 65 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుచరీత, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు బస్సుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపో నుండి తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి వరకు బస్సులో వారంతా ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రవాణా శాఖ తరుపున ఆర్టీసీ రాణిగంజ్ నుండి 65 బస్సులు ప్రారంభం చేసుకున్నామని, ఇప్పటికే హైదరాబాద్ ,కరీంనగర్ , నిజామాబాద్ , నల్గొండ ,సూర్యాపేట లలో ఇవి బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. 2 సంవత్సరాల్లో ఇప్పుడున్న 40 శాతం బస్సులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ లో నూతన రక్తం వస్తుందని.. కొత్తగా డ్రైవర్లు , కండక్టర్ లు, కార్మికులు వస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం,ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకుందని తెలిపారు. ఢిల్లీలో నివాస యోగ్యం లేకుండా కాలుష్యం ఉన్న పరిస్థితి ఉందనొ..ఇక్కడ అలాంటి పరిస్థితి రాకుండా రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందన్నారు.

మహాలక్ష్మితో రెండేళ్లలో 251కోట్ల మహిళల ఉచిత ప్రయాణం

సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల ప్రజా పాలన ప్రభుత్వంలో మహా లక్ష్మీ పథకం ద్వారా ఇప్పటికీ 251 కోట్ల మంది మహిళలు..8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని మంత్రి పొన్నం వెల్లడించారు. హాస్పిటల్ లు, విద్యా, దేవాలయాలు , ఉద్యోగాలు బంధువుల ఇంటికి ఇలా ప్రయాణాలు చేశారన్నారు. దేవాదాయ శాఖ ఆదాయం మహా లక్ష్మీ పథకం ద్వారా పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్టీసీ బస్సులను మహిళను యజమానులను చేసిందని తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం ఈవీ బస్సులను సమ్మక్క సారలమ్మ జాతర, శ్రీశైలం, యాదగిరిగుట్టలకు ప్రత్యేకంగా నడిపిస్తున్నామని తెలిపారు. నూతన బస్ డిపో ల ఏర్పాటు , బస్ స్టేషన్ ల అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఈవి పాలసీ తెచ్చి..నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవి, CNG , LPG ఆటో లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలతో 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు కనెక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుందని, ఈరోజు నుండి 373 కొత్త కాలని లకు కనెక్ట్ చేయడానికి బస్సులు నడుస్తున్నాయని, దాదాపు 7 లక్షల మందికి కొత్తగా ప్రజా రవాణా సౌకర్యం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ ప్రజలకే కాకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్సులు అవసరమున్నాయో ఆర్టీసీ అధికారులకు లేదా ప్రజా ప్రతినిధులకు తెలుపవచ్చు అని సూచించారు. ఆర్టీసీకి సంబంధించి యాత్రా దానం కార్యక్రమాన్ని తీసుకున్నాం.. ఎవరైనా జన్మదినాలు సందర్భంగా ఎవరైనా ఎన్నారై ఉన్న ముందుకు రావచ్చన్నారు.

కొత్తగా 2400 బస్సులు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

తెలంగాణ ఆర్టీసీలోని కొత్తగా 2400 బస్సులు కొనుగోలు చేసి..అందుబాటులోకి తీసుకొచ్చామని, ఈ బస్సులు ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీసుకున్నామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఇంటర్సిటీ బస్సులు కూడా వస్తున్నాయని, 800కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే రెండు సంవత్సరాల్లో మొత్తం 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు. ఈ బస్సుల ద్వారా స్మూత్ జర్నీ చేయవచ్చు, ప్రతి బస్ ఒక రోజు ఒక టన్ కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గిస్తుందని తెలిపారు. 81 శాతం బస్సులు మహా లక్ష్మీ స్కీమ్ ద్వారా నడిచే బస్సులు ఉన్నాయని, ప్రతి రోజు 60 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటే అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉంటారు అని, ఇప్పటి వరకు 251 కోట్ల మహిళా ప్రయాణాలు ఉచితంగా ప్రయాణం చేశారని, 8500 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని తెలిపారు.