హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విధాత): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి రాజధాని ఎంపికపై వివాదం కొనసాగుతునే ఉన్నది. రాష్ట్రం విడిపోయి పదకొండు సంవత్సరాలు దాటుతున్నా ఇంకా రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ నిత్యం విమర్శలు గుప్పించుకుంటూ కొట్లాడుకుంటున్నాయి. రాజధాని రగడపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన డిజిటల్ మీడియా కాంక్లేవ్ లో వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి మూడు రాజధానుల పై స్పష్టత ఇచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా రావణకాష్టంలా రగులుతున్న సమస్యకు పార్టీ తరఫున ఆయన ముగింపు పలికారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్
ఏపీ రెండుగా విడిపోయిన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఖరారు చేశారు. ఓటుకు నోటు కేసు తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చివేయడంతోపాటు.. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. ఆ తరువాత అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. విపక్షంలో ఉన్న వైసీపీ అధినేత కూడా అమరావతికి అంగీకారం తెలుపడంతో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ చంద్రబాబు ప్రభుత్వం నోటిఫై చేసింది కూడా. 2015 అక్టోబర్ 22వ తేదీన అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరు కాగా, వైసీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి హాజరుకాలేదు. అమరావతి పేరుతో పెద్ద ఎత్తున భూములను లాక్కుంటున్నారని, భారీ అవినీతి జరుగుతోందని, అంతకు ముందే టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారంటూ వైసీపీ పుస్తకాలు కూడా ముద్రించింది.
ఇదీ అమరావతి నేపథ్యం
అమరావతి ప్రాంతం అత్యంత ప్రాచీన మానవ ఆవాస స్థానాలలో ఒకటి. ఈ ప్రాంతానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకుల వంటి చారిత్రిక రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న అమరావతిని నవ్యాంధ్రకు రాజధాని చేయాలని 2014లో ఎన్నికైన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2015 ఏప్రిల్ 1 వ తేదీన రాజధానికి అమరావతి పేరు పెట్టగా, మే 25వ తేదీన సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు తమ సారవంతమైన 33వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం హడ్కో, ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకులు రూ.17,500 కోట్ల రుణాలు మంజూరు చేయగా, కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు విడుదల చేసింది.
2019 డిసెంబర్ 17న మూడు రాజధానుల ప్రకటన
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి తాడేపల్లిలో ఇంటిని కూడా నిర్మాణం చేసుకుని గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారు. అధికారిక వికేంద్రీకరణ పేరుతో 2019 డిసెంబర్ 17న అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి ఏడీబీ, వరల్డ్ బ్యాంకు లు తప్పుకోగా, సింగపూర్ కన్సార్టియం కూడా వైదొలిగింది. దక్షిణాఫ్రికా వంటి దేశాలలో ఈ విధానం అమల్లో ఉందని, తమ ప్రభుత్వం విధానం పరిపాలనా వికేంద్రకరణ అని జగన్ స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో సచివాలయం, అసెంబ్లీ ఉండగా, కొచ్చిలో హైకోర్టు పనిచేస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజధాని భోపాల్ లో అసెంబ్లీ, సచివాలయం ఉండగా జబల్పూర్ లో హైకోర్టు ఉంది. మహారాష్ట్రలో ముంబై, నాగపూర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఉదహరించారు. ఇదే తరహాలో విశాఖపట్నం ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, కర్నూలు ను జ్యూడీషియల్ క్యాపిటల్, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కొనసాగిస్తామని సభాముఖంగా ప్రకటించారు. సీఎం ప్రకటన మేరకు 2020 జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) రద్ధు, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. శాసన మండలి ఛైర్మన్ గా టీడీపీ నాయకుడు ఉండడంతో బిల్లులు పెండింగ్ లో పడిన విషయం విధితమే. మండలి తో ఏమాత్రం సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చట్టం రూపొందించేందుకు తీర్మానం చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బలం సరిపోలేదు. ఆ తరువాత గవర్నర్ కు బిల్లులు పంపించి, మూడు రాజధానుల చట్టం రూపొందించారు.
హైకోర్టులో ఎదురుదెబ్బలు
మూడు రాజధానులకు అనుకూలంగా అధికారిక వైసీపీ నేతలు, అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కర్నూలు, విశాఖపట్నం లో గర్జన పేరుతో భారీ బహిరంగ సభలు జరిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది తమ విధానమని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మా విధానంలో మార్పు లేదని, దీనిపై విమర్శలను పట్టించుకోమని ఆయన చెప్పారు. మూడు రాజధానుల విషయంలో తమకు స్పష్టమైన విధానం ఉ:దని, రాజధాని పేరుతో టీడీపీతో పాటు మీడియాలో ఆ పార్టీకి సంబంధించిన వర్గం రాజకీయాలు చేస్తున్నాయని అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వికేంద్రీకరణకు ప్రజల మద్ధతు సంపూర్ణంగా ఉందన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ సమవేశాలు బెంగళూరుతో పాటు బెల్గాంలో కూడా నిర్వహిస్తున్నట్లుగానే తాము కూడా అమరావతిలో ఒక అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో గుల్భర్గా, ధార్వాడ్ లో హైకోర్టు బెంచి ఉన్నట్లే రాష్ట్రంలో బెంచ్‌లు వస్తాయన్నారు. విశాఖపట్నం ఏకైక రాజధాని అని అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా సహచర మంత్రుల ప్రకటనలను సమర్ధించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సన్నాహక సదస్సులో మాట్లాడుతూ, త్వరలో విశాఖపట్నం రాజధాని ఏర్పాటు అవుతుందని అన్నారు.
పోటా పోటీగా వైసీపీ, టీడీపీ ఆందోళనలు
అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతాంగం వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టింది. దీంతో వైసీపీ ఒక వైపు కాగా, మరో వైపు టీడీపీ తో పాటు బీజేపీ, ఉభయ కమ్యూనిస్టులు ఏకమయ్యాయి. జగన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై అమరావతి రైతులు భగ్గుమన్నారు. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనట్లయితే ఆత్మహత్యలు చేసుకుంటామని బాధిత రైతులు పురుగుల మందుల డబ్బాలతో రోడ్లెక్కారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగి కార్యాచరణ ప్రకటించారు. జై అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ అమరావతి నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రైతులు అంతటా మహా పాదయాత్రలు మొదలుపెట్టారు. అమరావతిలో 2021 నవంబర్ 1న మొదలైన నిరసన యాత్ర డిసెంబర్ 16న తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంతో ముగిసింది. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరో వైపు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై వాదోపవాదనలు సుధీర్ఘంగా జరిగాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని ముందే పసిగట్టిన వైసీపీ పెద్దలు, తాము చేసిన రెండు చట్టాలను 2022 మార్చి మొదటి వారంలో ఉపసంహరించుకున్నది. సీఆర్డీఏ రద్ధు, మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు హైకోర్టులో కూడా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అఫిడవిట్ సమర్పించారు. హైకోర్టు మార్చి 5వ తేదీన మూడు రాజధానుల పై తీర్పును వెలువరించింది. అమరావతిని రాజధానిగా మార్చే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదని, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కాల పరిమితిని కూడా విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ, స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లింది. అయితే ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం దిగిపోయే వరకు అంటే 2024 వరకు జగన్ మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. విశాఖలోనే రాజధాని అంటూ పలు వేదికల మీద చెబుతూ వచ్చారు. మూడు రాజధానులు అని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆ తరువాత విశాఖపట్నం రాజధాని గా ఉంటుందని ప్రకటించడం ప్రజలను మరింత అయోమయానికి గురిచేసింది. .
సరైన సమయంలో నిర్ణయం వెలువరించిన వైసీపీ
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మూడు రాజధానుల విషయంలో అయోమయానికి పుల్ స్టాప్ పెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పార్టీని పునరుత్తేజపరిచేందుకు అమరావతి నుంచే పాలన కొనసాగిస్తామని వైసీపీ అధినాయకత్వం సజ్జల రామకృష్ణా రెడ్డితో ఈ ప్రకటన చేయించిందని అంటున్నారు. వివాదం ముగియడంతో పాటు కార్యకర్తలు, నాయకులు అభ్యర్థుల విజయానికి పాటుపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైసీపీ సరైన నిర్ణయం తీసుకుందని, పార్టీకి లాభమే తప్ప నష్టం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పై ప్రజల భ్రమలు తొలిగాయని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోతున్నారనే ఆశలు సన్నగిల్లుతున్నాయనే చర్చ జరుగుతోంది. 2029లో అధికారంలోకి వచ్చే నాటికే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, ఒకవేళ అప్పుడు అధికారంలోకి వచ్చినా వైసీపీకీ మార్చే అధికారం ఉండదని ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. అందువల్లే ఈ లోపే మూడు రాజధానులను విరమించుకున్నట్లు ఒక ప్రకటన చేయడం వల్ల వివాదం ముగుస్తుందని, పార్టీ పటిష్టతకు అవకాశం కలగడమే కాకుండా కూటమి ప్రభుత్వం పై పోరాడేందుకు అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.