RTO । రోడ్లపై వాహనాలు తిరగాలంటే వాహనానికి ఆర్సీ కార్డు, డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే భారీ ఎత్తున పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారుల తనిఖీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో అడుగడుగునా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో ప్రతి వాహనదారుడు తన వెంట వాహన ఆర్సీ కార్డుతో పాటు తన డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకుంటారు. అలాంటిది వాహన దారులకు ఆర్సీ కార్డులు, వాహన చోదకులకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు రాకపోతే పరిస్థితి ఏమిటి? సరిగ్గా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో అధికారుల తీరు, కాంట్రాక్టర్లు సరిగ్గా కార్డులు సరఫరా చేయలేని స్థితి కారణంగా జనవరి నెల నుంచి వాహన దారులకు ఆర్సీకార్డులు, చోదకులుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు అందడం లేదని తెలుస్తున్నది. కారణమేమిటని ఆరా తీస్తే.. కార్డుల సరఫరా లేక పోవడంతో ఆలస్యం అవుతున్నాయని చెపుతున్నారు.
రాష్ట్రంలో ఒక్కో రవాణ శాఖ కార్యాలయంలో సగటున రోజుకు 300 వరకు వాహనాలకు ఆర్సీలు, మరో 300 వరకు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇలా జారీ చేసిన వాటికి వారం రోజుల్లో కార్డులు ప్రింట్ చేసి, వాహనదారుల ఇంటికి పోస్టులో పంపిస్తారు. వాహనాల ఆర్సీలు ఒక్కో రోజు 500 కూడా దాటుతాయని అంటున్నారు. కొత్త వాహనాలే కాకుండా రుణభారం తీరిన వాహనాలకు కొత్త కార్డుల జారీ, క్రయవిక్రయాల జరిగిన వాహనాలకు కొత్త ఆర్సీ.. ఇలా వచ్చే వాటన్నింటికీ కొత్త ఆర్సీలను ఆర్టీవో అధికారులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ వాహనాలకు అధికారులు ఆమోదించిన వెంటనే ఆర్సీలు ఇస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ, ఘనత వహించిన రవాణా శాఖ.. కీలకమైన లైసెన్స్‌లు, ఆర్సీలు జారీ చేయడంలో అంతులేని అలసత్వాన్ని ప్రదర్శిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వాహన దారులకు ఇబ్బంది కరంగా మారింది.
రవాణ శాఖ లైసెన్స్‌ల జారీకి, ఆర్సీ కార్డుల జారీకి నిర్దిష్టమైన ఫీజులు ఆన్‌లైన్‌లో వసూలు చేస్తున్నది. ఎక్కడా కూడా ఉచిత సేవలనేవి లేవు. ఒక్క కార్డు జారీకి 70 రూపాయలకు మించి ఉండదని ప్రింటింగ్ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. అయితే ఒక్క కార్డు జారీ చేయడానికి కారుకు రూ.400, టూ వీలర్‌కు రూ.200 వసూలు చేస్తున్న రవాణా శాఖ.. సకాలంలో కార్డులు ఇవ్వకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల సమయంలో వేలల్లో జరిమానాలు చెల్లించుకోవాల్సి వస్తున్నదని వాహనదారులు వాపోతున్నారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. 2025 జనవరి 25 నుంచి కార్డుల సరఫరా నిలిచి పోయిందని తెలుస్తున్నది. కొద్దికొద్దిగా మాత్రమే కార్డులు వస్తున్నాయని, ప్రస్తుతం ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆమోదం పొందినవి మాత్రమే ప్రింటింగ్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం మర్చి 18వ తేదీ వరకు ప్రింటింగ్ అయి డిస్పాచ్‌కు వెళ్లినట్లు చెపుతున్నారు. ఇందులో వాస్తవం ఏమిటో కానీ ఫిబ్రవరి చివరి రోజులు, మార్చి మొదటి వారంలో ఆమోదం పొందిన ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు మాత్రం ఇంకా రాలేదని ఒక ఆర్టీవో కార్యాలయం వద్ద పని చేస్తున్న ఒక ఏజెంట్ తెలిపారు. కార్డులు వచ్చిన వెంటనే పంపిస్తామని చెపుతున్నారు.