Tractor Driving | రహదారులపై వాహనాలు నడిపే వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్( Driving License ) తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు( Vehicles ) నడిపితే చట్ట రీత్యా నేరం. అలా నడిపిన వారికి జరిమానా( Fine ) విధిస్తుంటారు. మరి కూలీలను తరలించడానికి, వ్యవసాయ( Agriculture ) పనులకు ట్రాక్టర్లను విరివిగా వినియోగిస్తారు. మరి ట్రాక్టర్లు( Tractors ) నడపాలంటే.. లైసెన్స్ ఉండాలా? లేకపోయినా ఫర్వాలేదా ? మరి చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలోని జనాభాలో 80 శాతం మంది వ్యవసాయం దాని అనుంబంధ రంగాలపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయం చేసేందుకు ఎద్దులను వినియోగించేవారు. ఎద్దుల సాయంతో నాగలితో దుక్కులు దున్నేవారు. కానీ సాంకేతికత పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌తో దుక్కి దున్నడం నిమిషాల్లో అయిపోతోంది. వ్యవసాయ కూలీలతో పాటు ఎరువులు, ఇతర సామాగ్రిని తరలించేందుకు ట్రాక్టర్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు.
చట్టం ఏమి చెబుతుంది..?
మరి వ్యవసాయ పనులకు విరివిగా ఉపయోగించే ట్రాక్టర్‌ను రహదారితో పాటు పంట పొలాల్లో నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరమా..? లేకపోయినా ఫర్వా లేదా..? అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి..? అంటే.. సుప్రీంకోర్టు ప్రకారం, వ్యవసాయం కోసం వినియోగించే ట్రాక్టర్‌ను నడపడానికి లైసెన్స్ అవసరం. కోర్టు ప్రకారం, చట్టబద్ధంగా ట్రాక్టర్‌ను నడపడానికి మీకు తేలికపాటి మోటారు వాహనం (Light Motor Vehicle ) లైసెన్స్ ఉండాలి. ట్రాక్టర్‌లను ప్రధానంగా వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నప్పటికీ, వాటిని ప్రజా రహదారులపై నడిపేటప్పుడు మోటారు వాహనాలుగా పరిగణిస్తారు. అంటే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఈ లైసెన్స్ ఉంటే.. ఎవరైనా ట్రాక్టర్ నడపవచ్చని చట్టాలు చెబుతున్నాయి.
ఈ లైసెన్స్ పొందేందుకు ఎంత వయసు ఉండాలి..?
సాధారణంగా 7,500 కిలోగ్రాముల వరకు ఉండే కార్లు, తేలికపాటి వాహనాలకు ఉపయోగించే LMV లైసెన్స్, ట్రాక్టర్‌లను కూడా కవర్ చేస్తుంది. లైసెన్స్ లేకుండా, ట్రాక్టర్ నడపడం వల్ల భారీ జరిమానాలు లేదా చట్టపరమైన ఇబ్బందులు కూడా వస్తాయి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. ఎటువంటి పరిమితులు లేకుండా దేశంలోని రహదారులపై ఎలాంటి లైట్ మోటారు వాహనాన్ని అయినా నడపవచ్చు. ఏదైనా ఇతర డ్రైవింగ్ లైసెన్స్ లాగానే, ఈ లైసెన్స్ పొందడానికి కనీసం 18 ఏళ్లు వయస్సు నిండి ఉండాలి.