DK ARUNA |
విధాత: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ డీకే .అరుణ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కేంద్ర నిధులతో కాకపోతే కేసీఆర్ జేబులో నుంచి తీసి ఇచ్చారా? అని ప్రశ్నించారు. 2023 వరకే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణకు 11 రూపాయలు కూడా ఇవ్వలేదని నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడిన కేసీఆర్ కు ఇప్పటికే పార్లమెంటులో సున్నా స్థానాలకు పరిమితం చేశారన్నారు. ఇన్ని రోజులు బయటకు రాని కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేసి రజతోత్సవ సభ పేరుతో బయటకు వచ్చారని తెలిపారు. వాళ్ల ఉనికిని చాటుకోవడం కోసం సభ పెట్టారని వెల్లడించారు.
సీఎంగా పదేళ్లు పనిచేసి అభివృద్ధి పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని. కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంతో నిర్మించడంతో కూలిపోయిన సంగతి అందరికి తెలిసిందేనన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80 శాతం అయిపోయిందని మాట్లాడారని.. ఇప్పటి వరకు చుక్క నీరు రాలేదన్నారు. మహబూబ్‌నగర్‌లో ఏ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని, ప్రజలను మోసం చేశారు కాబట్టి వాళ్లను ఇంటికి పంపించారని అన్నారు. రాష్ట్రంలో మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తదని ఫామ్‌హౌస్‌లో కూర్చోని కేసీఆర్ కలలు కంటున్నారని అరుణ ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య ఉండేది బీజేపీ పార్టీ అని, ఫామ్‌హౌస్‌లో కలలు కనేది కేసీఆర్ అని విమర్శించారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్
అటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కేసీఆర్ వ్యాఖ్యపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేంద్రం తెలంగాణకు 11రూపాయాలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్దాలేనని రాజాసింగ్ విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. మిగులు బడ్డెట్ తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారన్నారు.
దురదృష్టం కొద్ది మా పార్టీ వాళ్లు కరెక్ట్‌గా లేరని.. లేకపోతే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ అధికారంలోకి వచ్చేదన్నారు. కేసీఆర్ అంటేనే జూటా మాటలకు బ్రాండ్ అని.. ఆ విషయాన్ని పలుమార్లు ఇప్పటికే నిరూపించుకున్నారంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదని.. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని కేసీఆర్‌కు హితవు పలికారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోందన్నారు.