Bhu Bharati Act | భూ భారతి చట్టం ద్వారా భూమి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనను కలిసిన జిల్లా కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని చెప్పిన మంత్రి గత ప్రభుత్వం ధరణి తో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. మంగళవారం సచివాలయంలో కొత్తగా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, నిజామాబాద్ కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంత్.. మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూములకు సంబంధించి రైతులు అనుభవించిన కష్టాలకు, బాధలకు విముక్తి కల్పించేలా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే రెండు నెలలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమైనవని భూ సమస్యల పరిష్కారానికి గడువుగా నిర్ణయించిన ఆగస్టు 15నాటికి న్యాయబద్దమైన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎవరూ ఊహించని రీతిలో భూ సమస్యలను పరిష్కరిస్తన్నామని అన్నారు. ప్రభుత్వం పధకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని సూచించారు.