హైదరాబాద్, సెప్టెంబర్(విధాత): టీచర్స్ డే పురస్కరించుకొని న్యాక్ ట్రైనర్ స్నేహలతకు రాష్ట్ర పతి చేతుల మీదుగా జాతీయ అవార్డు రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ టీచర్స్ అవార్డు అందుకున్న న్యాక్ ట్రైనర్ స్నేహలతకు ఫోన్ చేసి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు
ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని కొనియాడారు.
దేశ వ్యాప్తంగా 13 మంది ఈ వార్డుకు ఎంపికైతే తెలంగాణ నుండి న్యాక్ ఇన్ స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హన్మకొండకు చెందిన నక్క స్నేహలతకు అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణం అన్నారు. నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్ష న్ ను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్న మంత్రి, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కడంతో న్యాక్ ఫ్యాకల్టీ,సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు.
స్నేహలతను ప్రోత్సహించిన న్యాక్ డైరెక్టర్ శాంతి శ్రీ ని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర పతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న స్నేహలతకు న్యాక్ డైరెక్టర్ జనరల్(డీజీ),ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ అభినందనలు తెలిపారు.