ధాన్యం సేకరణ. పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై మంత్రుల సమీక్ష

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామక్రిష్ణారావు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ల తో జరిగిన సమీక్షలో పత్తి మొక్కజొన్న సోయాచిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

హైదరాబాద్, నవంబర్ 10(విధాత): ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామక్రిష్ణారావు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ల తో జరిగిన సమీక్షలో పత్తి మొక్కజొన్న సోయాచిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలులో ఎకరాకు 18.5 క్వింటాలు నుంచి 25 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని జిల్లా కలెక్టర్లు మంత్రి తుమ్మలకు తెలిపారు.

పత్తి కొనుగోలులో ఎల్1 ఎల్2 నిబంధనలు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు మంత్రి తుమ్మలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎకరాకు 7 క్వింటాలు పత్తి మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన ఎత్తివేసి 12 క్వింటాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
వర్షాలవల్ల రంగుమారిన సోయాచిక్కుడు కొనుగోలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు జిల్లా కలెక్టర్లకు మంత్రి తుమ్మల తెలిపారు. పంటల సేకరణకు ఈ నవంబర్ నెల కీలకమని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తుమ్మల దిశానిర్దేశం చేశారు.