హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విధాత):
Telangana Urea Shortage | యూరియా కొరత సమస్యతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం రెండు నెలలుగా రగులుతున్నది. వానకాలం (ఖరీఫ్) సీజన్ కావడంతో ఊరూ వాడా యూరియాపైనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉండటంతో ఇదొక ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసిన రైతాంగం ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత తొలిసారి ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కడానికి యూరియా కారణం కావడం గమనార్హం. మండల కేంద్రాల్లో తెల్లవారుజాము నుంచే తమ చెప్పులు, కండువాలను క్యూ లైన్లలో పెడుతున్న దృశ్యాలు నిత్యకృత్యం అవుతున్నాయి. ఎండల ధాటికి తాళలేక కొందరు సొమ్మసొల్లి పడిపోగా, రెండు రోజుల క్రితం మహబూబాబ్ జిల్లాలో ఇద్దరు రైతులు యూరియా కోసం బయలుదేరి మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైన చనిపోయారు. అదే జిల్లాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం క్యూ లో నిల్చున్నారు. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న గన్ మెన్ యూరియా కోసం బెదిరింపులకు దిగడంపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారు.
ఖరీఫ్ ప్రారంభం నుంచే యూరియా కొరతపై జరుగుతున్న ఆందోళనలు ఏ రోజుకారోజు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నెల రోజుల క్రితం వరకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అంత సీరియస్‌గా పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతాంగం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడం, పత్రికల్లో పతాక శీర్షికల్లో రైతుల ఆందోళనల వార్తలు రావడంతో తప్పని పరిస్థితుల్లో రంగంలోకి దిగారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ప్రభుత్వానికి రావాల్సిన చెడ్డ పేరు రానే వచ్చింది. రైతులు, పేదల అనుకూల ప్రభుత్వంగా ఉన్న పేరును కాంగ్రెస్ పార్టీ స్వయానా చెడగొట్టుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్షించకపోవడం విశ్లేషకులను, రైతాంగాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని తెలిసి, తాను కూడా అదే కుటుంబం వచ్చానని చెప్పుకొనే రేవంత్ రెడ్డి.. యూరియా సమస్య విషయంలో ఎందుకంత నిర్లిప్తతో ఉంటున్నారో అర్థం కావడం లేదని రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కొరతను అధిగమించేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తే పరిస్థితి కొంతలో కొంత మెరుగు పడేదని వ్యవసాయ శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం నుంచి తగినంతగా సరఫరా లేని సందర్భం కనుక, దేశంలో ఇతర రాష్ట్రాలలో ఎక్కడెక్కడ మిగులు ఉంది? దానిని ఎలా తెప్పించుకోవచ్చు? అనేదానిపై ఆలోచన చేస్తే బాగుండేదని అంటున్నారు. అక్కడ కూడా లభ్యం కానప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచారు, కాని వాళ్లు కూడా రాష్ట్రం అడిగిన మేరకు కోటా ఇచ్చే పరిస్థితుల్లో లేరని తెలుస్తున్నది. సీనియర్ అయిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఉన్నారు, ఆయనే చూసుకుంటారని రేవంత్ రెడ్డి వదిలేశారా? లేక వేరే అంశాలేమన్నా? ఉన్నాయా? అనే చర్చ నడుస్తున్నది. ఆయన సీనియర్ కావచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమీక్షించి, పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న తుమ్మల కూడా యూరియా కొరత విషయంలో ఎందుకింతగా నిర్లక్ష్యం వహించారనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ముందే ఊహించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారనే పేరు ఆయనకు ఉంది. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరొందిన ఆయన ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నిలకు పోవాలని అనుకున్నప్పటికీ, వెళ్లలేని పరిస్థితులను కల్పించారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఈ సమయంలో నోటిఫికేషన్ ఇస్తే యావత్ రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఓటమిపాలు అవుతామని అంటున్నారు.
ఇటీవల బీసీ బిల్లు విషయంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ధర్నా, ఇతర కార్యక్రమాలు సాగాయి. అదే రీతిలో యూరియా కొరతపై ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఎందుకు ఆందోళనకు దిగడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎంఐఎం ఎంపీతో కలిపితే తొమ్మిది మంది అవుతారు. వీరందరూ కూర్చుని ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తే కేంద్రం దిగిరావడమో లేదా బదనాం కావడం జరుగుతుందంటున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వం తన తప్పు లేదని రైతాంగం ముందు నిరూపించుకునే అవకాశంతో పాటు బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందనేది ప్రజల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ఢిల్లీలో ధర్నాలు, ఆందోళనలు చేయకుండా కేంద్ర మంత్రులను కలిసి లేఖలు ఇవ్వడం మూలంగా ఫలితముండదంటున్నారు. పత్రికల్లో కేంద్రాన్ని విమర్శించడం, ఆరోపణలు గుప్పించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదంటున్నారు. కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలలో యూరియా సమస్య ఖరీఫ్ ప్రారంభానికి ముందు నుంచీ ఉంది. అయితే రైతులు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు కొన్ని రోజులుగా అంతగా లేవు. ఒక్క తెలంగాణలోనే యూరియా సమస్యపై ప్రతినిత్యం మీడియాలో వార్తలొస్తున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలే చర్చించుకోవడం విశేషం.
పెద్దపల్లి జిల్లాలో రామగుండం పర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ ఉండగా దాని రిజిస్టర్డ్ కార్యాలయం ఢిల్లీలోని లోధీ రోడ్డులో ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కార్యాలయాన్ని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కార్యాలయాన్ని రామగుండం లేదా హైదరాబాద్ కు తరలించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కార్పొరేట్ కార్యాలయం రాష్ట్రంలో ఉన్నట్లయితే ఏమైనా సమస్యలు ఏర్పడితే వెంటనే వెళ్లి కలిసేందుకు, ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలో రెండు సార్లు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో గ్యాస్ పైపులైను లీకేజీ మూలంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రతి నిత్యం ఈ ప్లాంట్ లో 3,500 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఈ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి ఈ ఏడాది 60వేల మెట్రిక్ టన్నులు సరఫరా కావాల్సి ఉంది. గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఉన్నతాధికారులో సమావేశం నిర్వహించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాల్సిందిగా కోరారు.
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్) నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేస్తున్నారు. భారత్ పేరుతో తయారయ్యే యూరియాను నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ద్వారా కేటాయింపులు చేసి, సరఫరా చేస్తుంటారు. ఎన్ఎఫ్‌ఎల్ కార్పొరేట్ కార్యాలయం ఉత్తరప్రదేశ్ గౌతమ బుద్ధ నగర్, నోయిడాలో ఉండగా, రిజిష్టర్డు కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన విధంగానే జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం రాష్ట్రంలోని ఎంపీలు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి. రామగుండం కంపెనీలో 2021-22 లో ఉత్పత్తి అయిన మొత్తం యూరియాలో తెలంగాణ సింహ భాగం అనగా 57 శాతం దక్కించుకున్నది. ఆ మరుసటి సంవత్సరం 2021-22లో 51 శాతం, 2023-24లో 38 శాతం యూరియాను తీసుకోవడం విశేషం. 2021 – 22 నుంచి అయిన మొత్తం ఉత్పత్తిలో రాష్ట్రాలవారీగా యూరియా (మెట్రిక్ టన్నులు) సరఫరా వివరాలు ఇలా ఉన్నాయి.
2021 – 22 లో యూరియా సరఫరా (మెట్రిక్ టన్నులు)
తెలంగాణ | 21,810.10 (57%) |
ఆంధ్రప్రదేశ్ | 86,398.785 (23%) |
కర్ణాటక | 74,377.035 (20%) |
మొత్తం | 3,74,586.570 |
2022 – 23 లో యూరియా సరఫరా (మెట్రిక్ టన్నులు)
ఛత్తీస్‌గఢ్ | 17,495.37 (2%) |
ఆంధ్రప్రదేశ్ | 1,53,834.21 (19%) |
కర్ణాటక | 1,81,184.085 (21%) |
మహారాష్ట్ర | 29,027.475(3%) |
తమిళనాడు | 29,405.160 (4%) |
తెలంగాణ | 4,33,269.72 (51%) |
మొత్తం | 8,44,216.02 |
2023—24 లో యూరియా సరఫరా (మెట్రిక్ టన్నులు)
ఛత్తీస్‌గఢ్ | 51,945.840 (6%) |
ఆంధ్రప్రదేశ్ | 1,13,114.430 (14%) |
కర్ణాటక | 1,41,883.380 (17%) |
మహారాష్ట్ర | 60,860.970 (7%) |
తమిళనాడు | 85,628.250 (10%) |
తెలంగాణ | 3,11,342.940 (38%) |
మధ్యప్రదేశ్ | 54,568.890 (7%) |
మొత్తం | 8,19,344.700 |