విధాత : డీసీసీ అధ్యక్షుల ఎంపిక(DCC President Selection) వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Nalgonda Congress)లో అసమ్మతి జ్వాలలు(Internal Dissension) రగిలిస్తుంది. నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడిన కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి(Gummala Mohan Reddy) పార్టీ నిర్ణయంపై తన అసహనం వెళ్లగక్కారు. 30 సంవత్సరాలుగా భువనగిరి మున్సిపాలిటీలో, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న నాకు న్యాయం దక్కలేదంటూ యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి నిరాశకు గురైన పీసీసీ ప్రధాన కార్యదర్శి, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోత్నక్ ప్రమోద్ కుమార్ (Potnak Pramod Kumar)ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ కూడా మీడియా ముందు తమ అసమ్మతిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ లో తిడితేనే పదవులు వస్తాయేమో : గుమ్మల
నల్లగొండలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన గుమ్మల మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో తిడితేనే పదవులు వస్తాయేమోనని డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో పార్టీ వైఖరిపై సెటైర్లు వేశారు. డీసీసీ అధ్యక్ష పదవి అడిగిన ప్రతిసారి.. నా కులం నాకు అడ్డంకిగా మారిందని..అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు కావడం కూడా నాకు అవరోధంగా తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబెర్ కాకున్నా డీసీసీ అధ్యక్షుడు కావచ్చని..నా సీనియారిటీ, నా సర్వీస్ ఎందుకు పనికిరాలేదని వాపోయారు. మా నాన్న ఎమ్మెల్యేనో, ఎంపీనో అయితే నాకు ఎమ్మెల్యే పదవి వచ్చేదని, రెడ్డి కులం డీసీసీ కి అడ్డయితే..దీనిపై అధిష్టానం విజ్ఞతకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నానన్నారు. జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల నుంచి నా పేరు డీసీసీ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారని, అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డుకుందని, గత రెండు ఏళ్లుగా కాంగ్రెస్ లో వలస నాయకులకే పెద్ద పీట వేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి నా గొంతు కోశారు
భుజం మీద చేయి వేసి.. సీఎం రేవంత్ రెడ్డి నా గొంతు కోశారు అని ఆరోపించారు. సీఎం రేవంత్ కు దగ్గర ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి పర్యాటక కార్పొరేషన్ పదవి వచ్చిందని, రేవంత్ కు దగ్గరగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఇద్దరు ఎంపీ లు అయ్యారని గుర్తు చేశారు. రేవంత్ వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవి వచ్చేదన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్దరికీ చెపుతున్నాం.. పార్టీకి నష్టం చేసే వాళ్ళను వెంట తిప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని గుమ్మలు హెచ్చరించారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇతర పార్టీ కొన్ని గుంట నక్కలు ఉన్నాయని ఆరోపించారు.
పార్టీ లైన్ దాట కుండా పని చేయడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాకు నేర్పారని, మంత్రి కోమటిరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వస్తుందని..నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నానని గుమ్మల తెలిపారు. ఏది ఏమైనా పార్టీ నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటానని, భవిష్యత్తు ఏమిటన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. కొత్త డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ తో కలిసి పనిచేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
