Hidden Nallamala Falls | విధాత : ప్రకృతి అందాలకు..అరుదైన వణ్యప్రాణులు..మొక్కలు, వృక్ష జాతులకు నెలవై..కృష్ణమ్మ తో పాటు పలు ఉప నదులు..వాగులు వంకల ప్రవాహాలతో జీవ వైవిధ్యంతో కూడిన నల్లమల అడవులలో సుందర జలపాతాలు కూడా కనువిందు చేస్తున్నాయి. మన్నేవారిపల్లి గ్రామం శ్రీశైలం ఎడమ కాలువ వెనుక వైపు సమీపంలో ఒ సుందర జలపాతం తాజావర్షాలు, వరదలతో దిగువకు జాలువారుతూ అబ్బురపరుస్తుంది. 500 మీటర్ల ఎత్తులో కొండల నుంచి కిందికి దూకుతున్న ఈ జలపాతం మధ్యలో 100 మీటర్ల దిగువన రెండు పాయలుగా విడిపోయి కిందకు దూకుతు చూపరులను ఆకట్టుకుంటుంది.
చాకలి బండ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ జలపాతం సమీపంలో పెద్దమ్మగుడి, శివలింగం కూడా ఉంది. ఈ జలపాతం నీళ్లు ఎగువన కొండ ప్రాంతాలనుంచి దిగువకు పారుతూ చాకలి బండ నుంచి మన్నేవారిపల్లి పరిధిలోని కానుగుల చెరువు నుంచి డిండి వాగులో కలిసి అక్కడి నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కలుస్తుంది. సమీపంలోని శివాలయాలతో కలిపి..ఈ జలపాతం ప్రాంతాన్నిపర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే సందర్శకులు భారీగా వస్తారని అందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.