Site icon vidhaatha

Nellimarla: ఆ అమరత్వానికి.. నేటికి 31ఏండ్లు!

1990లలో నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాల్ని ఆసరా చేసుకొని ఆనాడు ఉనికిలో వున్న కార్మిక చట్టాల్ని తుంగలో తొక్కి కార్మికవర్గ బ్రతుకులతో పెట్టుబడిదార్లు చెలగాటం ఆడారు. కార్మిక హక్కుల్ని కాలరాయడానికి అక్రమ లాకౌట్లకి పూనుకున్నారు. ఆ పరిస్థితుల్లో నెల్లిమర్ల జూట్ మిల్లు (Nellimarla Jute Mill) కార్మికవర్గం తమ కుటుంబాలతో సహా రోడ్డెక్కి సమరశీల పోరాటాలు చేపట్టింది. ఆ కొత్త సమరశీల పోరాట పంథా అణచివేత కోసం ఆనాటి పాలకవర్గాలకు కొత్త అణచివేత ప్రక్రియ కూడా అవసరమైనది. ఆ తరహా నిర్భందకాండకు నెల్లిమర్ల ప్రయోగశాలగా మారింది. ఆ క్రమంలో పెట్టుబడిదార్లకు అండగా 29-1-1994 వ తేదీన శాంతియుతంగా రైల్ రోకో చేస్తున్న వేలాది కార్మిక కుటుంబాల పై రాజ్యం పోలీస్ కాల్పులు జరిపించింది. ఐదుగురు కార్మికయోధులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారి అమరత్వం భారత కార్మికోద్యమ చరిత్రలో సంస్మరణీయమైనది. సదా స్ఫూర్తిదాయకం.

ఆనాటి పాలకవర్గాలు ఆనాటికి ఉనికిలో వున్న కార్మిక చట్టాల్ని తుంగలో తొకుతున్న నేపథ్యమది. ఆ పాలకవర్గాల విధానం కూడా తమకు సరిపోదని పెట్టుబడిదారీ వర్గం తమ తరపున ముసుగు తీసి నగ్నమైన సేవచేసే ఫాసిస్ట్ పాలకుల్ని అధికారానికి తెచ్చుకుంది. అదే పదేండ్ల క్రితం గద్దెఎక్కి నేడు మన కళ్ళేదుట మోడీ సర్కార్ రూపంలో వుంది. ఆ గత కార్మిక చట్టాల్ని ఆనవాళ్లు లేకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ చట్టాల్ని అధికారికంగానే ఎత్తివేసి అంతకంటే ప్రమాదకర లేబర్ కోడ్లు తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ ఫస్ట్ నుండి వాటి అమలుకు కూడా దిగబోతోంది. నిజానికి అనధికారికంగా కోట్లాది మంది అసంఘటిత శ్రామికవర్గానికి ఇప్పుటికే రోజుకు 12 నుండి 16 గంటల పని చేస్తున్నది. దానిని ఇక చట్టబద్దం చేయాలని మోడీ సర్కార్ పూనుకుంది.

కార్పొరేట్ యాజమాన్యాలు పని గంటల పెంపు, పని భారాల పెంపు, జీతాల కోతలు, తొలగింపులు, మూసివేతల వంటి వివిధ నగ్నమైన కార్మిక వ్యతిరేక విధానాలకు చట్టబద్దత కల్పించడానికి వ్యూహం పన్నింది. మోడీ సర్కార్ అందుకోసం ఓ మానసిక యుద్దానికి దిగింది. ఈ క్రమంలో గతకాల పాత సాంప్రదాయ పోరాట రూపాలకి కాలం చెల్లింది. వాటికి బదులుగా కొత్త ప్రత్యామ్నయ సమరశీల పోరాటాల్ని నిర్మాణం చేయాల్సిన చారిత్రిక అవసరం ఏర్పడింది. ఆ వెలుగులో నాటి వీరోచిత నెల్లిమర్ల కార్మిక పోరాట సంస్మరణకు రాజకీయ ప్రాధాన్యత వుంది. నాటి నెల్లిమర్ల పోరాటంలో తమ అసువులు బాసిన ఐదుగురు కార్మిక వీర యోధుల అమరత్వం నేటి బాధిత కార్మిక, శ్రామిక, పీడిత వర్గాల ప్రజలకు సదా స్ఫూర్తిని అందిస్తుంది. రేపటికి నెల్లిమర్ల కాల్పులు జరిగి 31 ఏండ్లు నిండనున్నది. నెల్లిమర్ల 31వ వర్ధంతి సందర్బంగా ఆ యోధుల అమరత్వపు వెలుగులో ఉద్యమ దీక్ష వహిద్దాం.

నెల్లిమర్ల అమరత్వం వర్ధిల్లాలి. నెల్లిమర్ల అమర వీరులకు జోహార్లు.

గమనిక:–నెల్లిమర్ల అమర యోధుల 31వ వర్ధంతి సందర్బంగా 29-1-2025 నుండి 4-2-2025 వరకు స్మారక వారంగా పాటించాలని IFTU AP రాష్ట్ర కమిటీ ఈ ఏడాది కూడా పిలుపు ఇచ్చిన సమాచారాన్ని కూడా అందిస్తున్నా. – ఇఫ్టూ ప్రసాద్ (పిపి) 28-1-2025

Exit mobile version