Viral Post : ఈ రోజుల్లో కాస్త ఆసక్తికరమైనది ఏది కనిపించినా.. అలవోకగా నెట్టింట వైరల్ అయిపోతున్నది. అందులో ఉన్న ప్రత్యేకతే వాటిని సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశాలు చేస్తున్నది. తాజాగా బెంగళూరులోని ఒక హోటల్‌లో పెట్టిన నోటీసు.. ఇదే తరహాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యామిలీతో వెళ్లేవారిని మినహాయిస్తే.. సాధారణంగా హోటల్‌కు వెళ్లేవాళ్లు రాజకీయాలు, రియల్ ఎస్టేట్, సినిమాలు ఇలా అనేక అంశాలపై విస్తృత చర్చలు మొదలుపెడుతుంటారు. ఒక్కోసారి గంటలపాటు అవే చర్చల్లో మునిగిపోతుంటారు. దీంతో ఒకే టేబుల్ ఎక్కువ సమయం ఆక్యుపై అయి ఉండిపోవడంతో కొత్తవాళ్లు వస్తే కూర్చొనడానికి కూడా చైర్స్ ఉండవు. ఇదిలా ఉంచితే.. బెంగళూరులో ఒక ప్రముఖ హోటల్ కూడా ఇదే తరహా ఇబ్బందికి గురైందేమోగానీ.. ఓ వినూత్న నోటీసును బోర్డుపై పెట్టింది. దాని సారాంశం.. ఆ హోటల్‌లో రాజకీయాలు, రియల్ ఎస్టేట్‌పై చర్చలు నిషిద్ధం. తినడానికి వచ్చారు.. తిండి మీద కాన్‌సన్‌ట్రేషన్ పెట్టి.. తినేసి పోండి అంటూ సుతిమెత్తగానే సుద్దులు చెప్పేలా ఆ బోర్డు తయారు చేశారు. దీనిని ఒక ఔత్సాహికుడు ఫొటో తీసి, నెట్టింట పెట్టాడు. అంతే.. దీనిపై ఎడతెగని చర్చలు మొదలయ్యాయి.
పాకశాల అనే హోటల్‌లో ఈ సైన్‌బోర్డ్ పెట్టారు. చక్కగా భోజనాన్ని ఎంజాయ్ చేయాలని, రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై చర్చలు నిషిద్ధమని అందులో రాశారు. ఈ ప్రాంతం డైన్ ఇన్ కోసం మాత్రమే. రియల్ ఎస్టేట్, రాజకీయ చర్చల కోసం కాదు.. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి.. అని ఆ నోటీసు బోర్డులో ఉన్నది. దీనిపై నెటిజన్లు తలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపటిలోనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇలాంటి చెత్త చర్చల్లో ఉన్నవారిని చూస్తే ఒక పీకు పీకాలనిపిస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి వారికి కామన్ సెన్స్ ఉండబోదని, లొడ లొడ మాట్లాడుతుంటారని సీరియస్ అయ్యాడు. పది మంది వస్తారు.. ఐదు కప్పులు కాఫీ ఆర్డరిస్తారు.. ఆకాశం ఊడిపడేలా ముచ్చట్లు పెడతారు.. అంటూ రాసుకొచ్చాడు. పాకశాల పెట్టిన నోటీస్ బోర్డును ఆయన అభినందించాడు. మరి మా కుటుంబ రాజకీయాల సంగతేంటి? అని ఒక నెటిజన్ సరదాగా ప్రశ్నించాడు. “అవును.. ఇలాంటి రాజకీయ చర్చలు అంతూపొంతూ లేకుండా సాగిపోతుంటాయి. తినడానికి పట్టే సమయంకంటే ఎక్కువ టైమ్ వాటికే సరిపోతుంది. గంటల తరబడి టేబుల్స్ ఖాళీ అవ్వవు” అంటూ మరొకరు అసహనం వ్యక్తం చేశారు. కొందరైతే రియల్ ఎస్టేట్ గురించి చర్చించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.