విధాత: జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ ప్రచారం వాస్తవం కాదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ థియేటర్ల బంద్ వార్తలను ఖండించారు. శనివారం ఫిల్మ్ ఛాంబర్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. సమావేశ వివరాలను దామోదర ప్రసాద్ వెల్లడించారు.
జూన్ ఒకటి లోపు చర్చలు జరపకపోతే థియేటర్లు మూసివేస్తాం అని మాత్రమే గతంలో ఛాంబర్ చెప్పిందని.. దీంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని తప్పుగా ప్రచారం బయటకు వెళ్ళిందని వివరణ ఇచ్చారు. ఈ రోజు ఆల్ సెక్టార్ల మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం…యథావిథిగా థియేటర్లు రన్ అవుతాయని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తామనడం సరికాదన్నారు. చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని..ఒక్కోటి పరిష్కరించాల్సి ఉందన్నారు.
థియేటర్ల పర్సంటేజీ విషయమై కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదని..ప్రస్తుతం దీనిపై మూడు సెక్టార్ల నుంచి ఈనెల 30న కమిటీ వేస్తున్నామని..రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని తెలిపారు. థియేటర్ల బంద్ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్ధన్నారు. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి అందరిని కలుస్తామని..ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని..మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి పరిశ్రమలోని సమస్యలు వివరిస్తామని దామోదర ప్రసాద్ తెలిపారు.