Site icon vidhaatha

Operation Kagar | అవి ఎన్‌కౌంటర్‌లు కావు.. పట్టుకొని కాల్చేశారు! మావోయిస్టుల లేఖ.. 20న బంద్‌కు పిలుపు

Operation Kagar | కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్టులను హతమార్చుతూ మరోవైపు శాంతి చర్చల నాటకం ఆడుతున్నదని మావోయిస్టు పార్టీ విమర్శించింది. ప్రభుత్వ బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ, బీజేపీ హిందూత్వ ఫాసిస్టు కగార్‌ దాడులను వ్యతిరేకిస్తూ జూన్‌ 20న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంద్‌ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఇటీవల తమ పార్టీ నాయకులు ఏడుగురిని అత్యంత క్రూరంగా హత్య చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో చర్చల ప్రతినిధిగా వచ్చిన 45 ఏళ్ళ సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవం కలిగిన సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు టీఎల్ఎన్ఎస్ చలం అలియస్ ఆనంద్, సుధాకర్, గౌతంతోపాటు 30 ఏళ్ళ విప్లవోద్యమ అనుభవం కలిగిన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియస్ భాస్కర్ పాటు ఏడుగురిని క్రూరంగా హత్య చేశారని తెలిపారు. ప్రభుత్వ దమనకాండను ఖండించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామంటూ 2024 జనవరి నుండి ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలోని మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలన్నిటిలో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ నరసంహారానికి పాల్పడుతున్నదని ఆ ప్రకటనలో తెలిపారు. అటవీ సంపదను, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. ఇందుకోసమే అటవీ ప్రాంతంలోని ఆదివాసులపై, వారికి అండగా ఉండే మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులు చేస్తూ 550 మందికి పైగా హత్యలు చేసిందని ఆరోపించారు.

ఏడుగురిని పట్టుకొని చంపేశారు

మే 21 న మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల బసవరాజ్‌తోపాటు 27 మందిని పొట్టనపెట్టుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. జూన్ 3వ తేదీ నుండి నేషనల్ పార్క్ దిగ్బంధంతో తమ పార్టీకి చెందిన ఏడుగురిని హత్య చేశాయని జగన్‌ ఆరోపించారు. జూన్ 3 నుండి 9 వరకు వారం పాటు నేషనల్ పార్క్ ఏరియాను జల్లెడ పట్టిన భద్రతాబలగాలు.. ఆ క్రమంలోనే తమ పార్టీ నాయకులను నిరాయుధులుగా ఉన్న సమయంలో పట్టకున్నారని తెలిపారు. జూన్‌ 4వ తేదీ రాత్రి చిమ్మ చీకటిలో తమ దళం రిట్రీట్‌ అవుతున్నప్పుడు గౌతం దళం నుంచి విడిపోయాడని పేర్కొన్నారు. జూన్‌ 5వ తేదీన ఉదయం 9.. 10 గంటల మధ్య గౌతంను బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు. వారితో పోరాడే క్రమంలో గౌతమ చనిపోయినట్టు వెల్లడించారు. జూన్ 6వ తేదీన పెద్దకాక్లేర్ గ్రామ సమీపంలో ఉన్న మరొక దళంపై బలగాలు దాడిచేసినప్పుడు వారితో పోరాడుతూ భాస్కర్ చనిపోయినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. జూన్ 6, 7 తేదీలలో రైనీ (నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు) అనారోగ్య కారణంగా ఇరుపగుట్ట గ్రామంలో నిరాయుధంగా ఉన్నప్పుడు పోలీసులు పట్టుకొని హింసించి హత్య చేశారని పేర్కొన్నారు. కుమ్రంభీం-మంచిర్యాల డివిజన్ కి చెందిన సభ్యులు సంతోష్ (భాస్కర్ గార్డ్), రజని, నేషనల్ పార్క్ ఏరియా 2 పీఎల్ సభ్యుడు లాల్సూ, కుడియం మహేష్ (ఇరుపగుట్ట గ్రామస్తుడు)లను పట్టుకొని హత్య చేశారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ తెలిపారు.

Exit mobile version