వర్షం చినుకులు బురదనూ, ఇన్ ఫెక్షన్లనే కాదు.. కమ్మని వాసనను కూడా మోసుకొస్తాయి. వర్షం పడగానే వచ్చే నేల వాసన ఇష్టపడని వాళ్లు ఉండరు. వరదలూ, ఇన్ ఫెక్షన్ల గొడవ పక్కన పెడితే వర్షం పడినప్పుడు వచ్చే చల్లని గాలి, కమ్మని వాసన మనసుకు ఆహ్లాదాన్నిఅందించి, స్ట్రెస్ ని తగ్గిస్తుంది. అందుకే మనసు బాగాలేనప్పుడు వేడి వేడి కాఫీ తాగుతూ, కిటికీలో నుంచి అలా వర్షాన్ని చూస్తూ ఉంటే ఆ హాయే వేరు. అయితే వర్షం పడగానే వచ్చే ఈ ప్రత్యేకమైన సుగంధం ఎందుకు వస్తుందో తెలుసా?
వర్షం తరువాత వచ్చే ఈ వాసనను శాస్త్ర పరిభాషలో పెట్రిచోర్ అంటారు. దీనికి కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దీని వెనుక ఉన్నది నేలలో నివసించే సూక్ష్మజీవులు. ప్రత్యేకించి బాక్టీరియా. ఆక్టినోమైసిటిస్ అనే పేరు గల బాక్టీరియా.
సుగంధం వెనుక ఉన్న సైన్స్
ఆక్టినోమైసిటిస్ అనే ఈ బాక్టీరియా నేలలో ఉండి, “జియోస్మిన్” అనే రసాయన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ పదార్థం మనకు అరోమా థెరపీ లాగా పనిచేస్తుంది. అంటే ఈ వాసన పీల్చగానే మనసుకు మంచి భావన కలుగుతుంది. మనలో వాసనను గుర్తించే గ్రంథులు జియోస్మిన్‌ను ట్రిలియన్ పార్ట్స్ లో గుర్తించగలవు. అంటే, చాలా తక్కువ పరిమాణంలో కూడా మనం ఈ వాసనను స్పష్టంగా గుర్తించగలం. వర్షం పడ్డప్పుడు వర్షపు చుక్కలు నేలకు తగలగానే జియోస్మిన్‌తో నిండిన బాక్టీరియా సూక్ష్మ స్ఫోర్లు గాలిలోకి విసరబడతాయి. మనం ఈ స్ఫోర్లనే వాసన ద్వారా గుర్తిస్తాం. పెట్రిచోర్ వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే.
మొక్కల వాసనలు మరియు తేమ
అయితే వాన తర్వాత వచ్చే వాసనకు కేవలం బాక్టీరియా మాత్రమే కారణం కాదు. వాన కురిసినప్పుడు, నేలలో ఉన్న మొక్కల నూనెలు, సజీవ పదార్థాలు, తేమ కూడా గాలిలోకి విడుదలై, ఆ సుగంధాన్ని మరింత పెంచుతాయి. ముఖ్యంగా వర్షం కొద్దిగా చినుకులుగా పడినప్పుడు ఈ అరోమా మరీ ఎక్కువగా ఉంటుంది.
వర్షం… మన మానసిక స్థితి
ఈ వాసన పీల్చినప్పుడు మనలో పాజిటివ్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి. దానివల్ల మనసుకు శాంతి కలుగుతుంది. ఉల్లాసభరిత అనుభూతిని కలిగిస్తుంది. మానసికోల్లాసం పెరుగుతుంది. వర్షపు గాలి మనసుకు వెచ్చని అనుభూతిని, ఈ వాసన ఒక రిలాక్సింగ్ ఫీలింగ్ ని ఇస్తుంది.
