పెద్ద కుక్క‌ల కంటే ప‌ప్పీలే ఎక్కువ కాలం జీవిస్తాయి..కార‌ణ‌మేమిటంటే.?

ఎన్నో ఏళ్ల ప‌రిశోధ‌న‌లు, అధ్యయ‌నాలు, చ‌ర్చోప‌చ‌ర్చ‌ల అనంత‌రం పెద్ద సైజు కుక్క‌ల కంటే చిన్న సైజు కుక్క‌లు ఎక్కువ రోజులు జీవించ‌డం వెనుక మిస్ట‌రీ బ‌య‌ట‌ప‌డింది

  • Publish Date - January 22, 2024 / 10:21 AM IST

ఎన్నో ఏళ్ల ప‌రిశోధ‌న‌లు, అధ్యయ‌నాలు (Study) , చ‌ర్చోప‌చ‌ర్చ‌ల అనంత‌రం పెద్ద సైజు కుక్క‌ల కంటే చిన్న సైజు కుక్క‌లు ఎందుకు ఎక్కువ రోజులు జీవించ‌డం వెనుక మిస్ట‌రీ బ‌య‌ట‌ప‌డింది. ఒకే రోగం పెద్ద కుక్కకు, చిన్న కుక్క‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వాటి వ‌ల్ల త‌లెత్తే దుష్ప‌రిణామాలు పెద్ద కుక్క‌లో ఎక్కువ ఉంటాయ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ వాషింగ్ట‌న్ చేసిన ప‌రిశోధ‌న‌లో తేలింది. దీని వల్లే పెద్ద కుక్క‌లు (Dogs) త్వ‌ర‌గా మ‌ర‌ణిస్తాయ‌ని ఈ యూనివ‌ర్స‌టీ పేర్కొంది. ఈ అధ్య‌య‌నం వివ‌రాల‌ను పీఎల్ఓఎస్ ఒన్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. ఆ వివ‌రాల ప్ర‌కారం.. ఈ అధ్య‌య‌నం కోసం 238 జాతుల‌కు చెందిన 27,500 కుక్క‌ల‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. డాగ్ ఏజింగ్ ప్రాజెక్ట్ కింద పెంపుడు శున‌కాల య‌జ‌మానులు ఈ ప‌రిశోధ‌న‌కు త‌మ కుక్క‌ల పేర్ల‌ను పంప‌గా.. వాటి జీవ‌న‌శైలిని దీర్ఘ‌కాలంలో ప‌రిశోధ‌కులు ప‌రిశీలించారు.


ఈ 27,500 కుక్క‌ల స‌గ‌టు వ‌య‌సు ఏడు సంవ‌త్సరాలు కాగా..ఇందులో అన్ని వ‌య‌సు గ్రూపుల‌, అన్ని సైజుల శున‌కాలూ ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు వీటికి వ‌చ్చిన వ్యాధులు, రోగ నిరోధ‌క శక్తి, చికిత్స‌కు స్పందించిన తీరును ప‌రిశీలించిన అనంత‌రం.. పెద్ద సైజులో ఉన్న కుక్క‌లు కేన్స‌ర్‌, ఎముక‌ల సంబంధిత వ్యాధులు, పేగు వ్యాధులు, న‌రాల సంబంధిత స‌మ‌స్య‌లు, అంటువ్యాధుల బారిన ఎక్కువ ప‌డుతున్న‌ట్లు నిర్ధార‌ణ‌కొచ్చారు. అంతే కాకుండా వేగంగా బ‌రువు పెర‌గ‌డం, అదీ అతిగా పెర‌గ‌డం వ‌ల్ల వాటి అస్థి పంజ‌ర వ్య‌వ‌స్థ‌పై భారం ప‌డుతోందని.. ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు చిన్న సైజు పప్పీలు ఎక్కువ‌గా గుండె, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి, త‌క్కువ సంఖ్య‌లోనే అయినా కాలేయం స‌మ‌స్య‌లూ వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. కుక్క ప‌రిమాణం, వ‌య‌సు, దానికి వ‌చ్చే వ్యాధులకు మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిట‌నేది ఈ అధ్య‌య‌నంలో అంత బ‌లంగా వెల్ల‌డి కాలేదు. అయితే పెద్ద కుక్కలు ఎందుకు త్వ‌ర‌గా చ‌నిపోతున్నాయ‌నేది కాస్త లోతుగా తెలిసింది. జంతు వైద్యులు ఈ ప‌రిశోధ‌న‌ను అధ్య‌య‌నం చేస్తే… పెద్ద శున‌కాల‌కు, చిన్న శున‌కాల‌కు అందించాల్సిన వైద్యంలో తేడా తెలుస్తుంది అని అధ్య‌య‌న క‌ర్త యుంబి నామ్ పేర్కొన్నారు.

Latest News