విధాత: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ అమలు నేపథ్యంలో నగరంలోని రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అమలు చేయలేపోయింది. అయితే ఈనెల 25నుంచి ఎన్నికల కోడ్ ముగిసిపోవడంతో ఇక మే 1వ తేదీ నుంచి నగరంలో సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి.
రేషన్ డీలర్లు పెట్టిన ఇండెంట్ మేరకు నగరంలోనిక 653రేషన్ దుకాణాలకు సివిల్ సఫ్లయ్ గోదాంల నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతమున్న కార్డుల సంఖ్య మేరకు 15వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డులోని సభ్యులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్ని బియ్యం అందిస్తారు.
కాగా రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యంలో క్వింటాల్‌కు ఒక కిలో సార్టెక్స్ బియ్యాన్ని కలిపి ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. సార్టెక్స్ రైస్ ఆరోగ్యకరమైనవి, ఇవి ప్లాస్టిక్ రైస్ తరహాలో ఉంటాయని..వాటిని చూసి బియ్యంలో ప్లాస్టిక్ రైస్ వచ్చిందన్న అనుమానాలు పెంచుకోవద్దని అధికారులు చెబుతున్నారు. బియ్యం పంపిణీలో డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వెంటనే సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.