Kerala | Sri Krishna Mandir
విధాత: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేరళలోని త్రిస్సూర్ సమీపంలోని గురువాయూర్ గ్రామం గురువాయూర్(శ్రీకృష్ణుడు) ఆలయంలో స్వామివారికి గజ సేవ చాల ప్రాముఖ్యమైనది. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో కొలవబడుతున్నాడు. ఇక్కడ గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని ఊహించలేమంటారు.
ముఖ్యంగా ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏనుగుల పరుగు పందాలలో గెలిచిన విజేత ఏనుగు తదుపరి ఒక సంవత్సరం పాటు దేవుడి విగ్రహాన్ని మోస్తుంది. అందుకే ఆ స్వామి సేవా భాగ్యం దక్కించుకునే ఏనుగును ఎంపిక చేసేందుకు ఏటా పరుగు పందాలు నిర్వహిస్తుంటారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో 10 రోజుల వార్షిక ఉత్సవం ప్రసిద్ధ అనయోట్టం (ఏనుగుల పందెం)తో ప్రారంభమైంది.
తాజాగా నిర్వహించిన ఏనుగుల పరుగు పందెం పోటీలను లక్షల మంది భక్తుల వీక్షించడం ఆసక్తికరం. పురు వీధులలో మావటీల సారధ్యంతో గజరాజులు భూమి దద్ధరిల్లేలా..ఘీంకారాలతో పరుగు పందాలలో పోటీ పడటం విశేషం. స్థానిక ప్రజలు, సందర్శకులు పెద్ధ సంఖ్యలో పోటీలను వీక్షిస్తూ కేరింతలతో ఏనుగులను ప్రోత్సహించారు. అనయోట్టంలో బాలు ఏనుగు మొదట ఆలయ గోపురం వద్ధకు చేరుకుంది. బాలు ఏనుగు మొదటి స్థానంలో, చెంతమరాక్షన్ రెండో స్థానంలో , దేవదాస్, నందన్ ఏనుగులు తర్వాత స్థానంలో నిలిచాయి. పందెంలో విజయం తర్వాతా బాలు తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి గురువాయురప్పన్ కు నైవేధ్యంగా ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసింది. త్వరలో జరిగే గురువాయూర్ ఉత్సవాల్లో సీవేలి ఆచారంలో భాగంగా శ్రీ భూతబలి ఊరేగింపులో బాలు ఏనుగు గురువాయురప్పన్ బంగారు విగ్రహాన్ని(తిడంపు) మోసుకెళ్లనుంది.
గురువాయూర్ సేవలో గజేంద్రులు
గురువాయూర్ సేవలో తరించిన పద్మనాభన్, కేశవన్ అనే ఏనుగుల కథలను స్థానికంగా ఇప్పటికి ఆసక్తిగా చెప్పుకుంటుంటారు. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందని కథనం. పద్మనాభన్ వారసత్వాన్ని కేశవన్ ఏనుగు అందిపుచ్చుకుంది. స్వామివారిని తనపై ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారట. ఆ పుణ్య గజరాజు 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించింది. గురువాయూర్ సేవ కోసం ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలో దేవస్థానం ఆధ్వర్యంలో ఏనుగులశాల నిర్వహిస్తున్నారు. అందులో సుమారు 50 ఏనుగుల వరకూ ఉంటాయి. ఇందులో కేశవన్ ఏనుగు విగ్రహం కూడా ఉంది.