విధాత: మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు వడదెబ్బ షాక్ ఇస్తుంది. చత్తీస్ గఢ్ బీజాపూర్ – తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న 40 మంది జవాన్లకు వడదెబ్బ కొట్టింది. దీంతో వారు డిహైడ్రైషన్ కు గురై అస్వస్థత పాలయ్యారు. వారిని ఆర్మీ హెలికాప్టర్లో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. చత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలలో బచావో కర్రె గుట్టలు ఆపరేషన్ ను మూడు రోజులుగా భద్రతా బలగాలు కొనసాగిస్తున్నాయి.
మావోయిస్టు అగ్రనేతలు, మావోయిస్టు పార్టీ మిలటరీ విభాగం(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ముఖ్యనాయకులు తమ దళాలతో కర్రెగుట్టలలో ఉన్నారని కూంబింగ్ కొనసాగిస్తున్నారు. వేలాది మంది భద్రతా బలగాలు కర్రె గుట్టలను రెండు రాష్ట్రాల వైపు నుంచి చుట్టుముట్టాయి. డ్రోన్లు, హెలికాప్టర్ లను కూడా వినియోగిస్తూ మావోయిస్టు స్థావరాల వైపు బలగాలు దూసుకెలుతున్నాయి. కర్రె గుట్టలను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం..గుట్టలు ఎక్కి దిగాల్సి ఉండటంతో భద్రతా బలగాలు వడదెబ్బ బారిన పడుతున్నాయి.