విధాత : మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న రూ.215 కోట్ల ఈడీ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సుకేశ్ ఆర్థిక నేరాలు గూర్చి తెలిసినప్పటికి అతనితో సంబంధాలు కొనసాగించిన జాక్వెలిన్ అతని నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్లుగా గుర్తించింది. జాక్వెలిన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్, మినీ కూపర్ సహా రూ.10కోట్ల విలువైన కానుకలను సుకేశ్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.