JP Company MD Manoj : ఎస్ ఎల్బీసీ కాంట్రాక్టర్ మనోజ్ అరెస్టు చేసిన ఈడీ

ఎస్ ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మనోజ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది.

JP Company MD Manoj

విధాత, హైదరాబాద్ : ఎస్ ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు కాంట్రాక్టర్ జేపీ సంస్థ ఎండీ మనోజ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అక్రమ వ్యాపారాల అభియోగాల నేపథ్యంలో అరెస్టు చేసినట్లుగా సమాచారం.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మనోజ్‌ను అదుపులోకి తీసుకుంది. జేపీ సంస్థ నిర్వహిస్తున్న ఎస్ ఎల్బీసీ టన్నెల్‌ పనులలో గత ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రెండు మృతదేహాలను బయటకు తీశారు. మరో ఆరుగురి ఆచూకి లభించలేదు. ఆ కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. సాంకేతిక ఉప కమిటీ నివేదిక చేతిక అందాక ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ (దోమలపెంట) నుంచి తదుపరి టన్నెలింగ్‌ తవ్వకమంతా డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

మొత్తం 43.39 కి.మీ… మిగిలింది 9.8 కి.మీ

ఫ్లోరైడ్‌ పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సుమారు మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 500కు పైగా గ్రామాలకు తాగునీరు మందికి తాగునీరందించాలనే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీని 1983లో ప్రతిపాదించారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నల్లమలలోని ఏటీఆర్‌ పరిధిలో సుమారు రూ.4,600 కోట్ల వ్యయంతో భూగర్భంలో 43.93 కిలోమీటర్ల మేర సొరంగం (టన్నెల్‌) నిర్మాణ పనులను టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌) పద్ధతిన చేపట్టారు. భూ పొరల్లో వచ్చిన మార్పులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దోమలపెంట వద్ద టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు దోమలపెంట ఇన్‌టెక్‌ నుంచి 13.94 కి.మీ., మన్నెవారిపల్లి ఔట్‌లెట్‌ నుంచి 20.4 కి.మీ. టన్నెల్‌ పనులు పూర్తికాగా.. ఇంకా 9.8 కి.మీ. మేర చేపట్టాల్సి ఉంది.