విధాత, హైదరాబాద్ : సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. చంచల్‌గూడ జైలులో నిందితులను ఈడీ బుధవారం విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను జైలులో ఈడీ అధికారులు ప్రశ్నించారు. కోర్టు అనుమతి మేరకు నమ్రతతో పాటు మరో నలుగురు నిందితులు కళ్యాణి, నందిని, సంతోషీ, జయంత్ కృష్ణల స్టేట్‌మెంట్‌లను కూడా ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఈ విచారణకు ఈ నెల 28వ తేదీ వరకు కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది.
సరోగసి పేరుతో సంతానం కల్గిస్తామని..చైల్డ్ ట్రాకింగ్ కు పాల్పడి మోసాలు, నేరాలకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ పై తొలుత గోపాలపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులంతా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించిన వ్యవహారంలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో సోదాల్లో నిందితులు భారీగానే ఆస్తులు కలిగి ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తనిఖీల సమయంలో కీలకమైన దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకుంది. అబార్షన్ కోసం వచ్చే మహిళలకు నగదు ఆశ చూపి.. వారి వద్ద నుంచి సైతం పిల్లలను కొనుగోలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
మొత్తం 86 మంది పిల్లలను విక్రయించడం ద్వారా.. రూ.50కోట్ల నగదు డాక్టర్ నమత్రా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం నగదును హావాలా రూపంలో సేకరించింది. వీటితో భారీగా ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా.. విదేశాలకు సైతం పెద్దఎత్తున హవాలా రూపంలో నగదు పంపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను డాక్టర్ నమత్ర నుంచి ఈడీ అధికారులు రాబడుతున్నారు. కేసు విచారణలో భాగంగా కోర్టు నిందితులను విచారించేందుకు అనుమతించడంతో వారికి మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు నిందితులను జైలులోనే ఈడీ విచారించనుంది.