Harish Rao | ఏపీ ప్రభుత్వం గోదావరి నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు గోదావరి జలాలలో తీరని నష్టం వాటిల్లనుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్ర జరుగుతుందని..తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం బనకచర్లను కడుతుంటే కేంద్ర సహకరించడం అన్యాయంగా ఉందన్నారు. బనకచర్లపై నీతి అయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిలదీయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. గోదావరి బనకచర్లను ఆపాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి.. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచర్లను ఆపాలన్నారు. లేకుంటే ఢిల్లీలో సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పటికి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు. అన్ని పార్టీ నేతలను కిషన్ రెడ్డి ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్ళాలని హరీష్ రావు అన్నారు.
గురుదక్షిణ చెల్లించుకుంటున్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. బనకచర్లతో పాటు ఏపీ ప్రభుత్వం తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు గండికొట్టెలా నిర్మిస్తున్న ప్రాజెక్టుల పట్ల మౌనంగా ఉండి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చుకుంటే.. చంద్రబాబు 2018లో కేంద్ర జలవనరుల శాఖకు అభ్యంతరాలు లెవనెత్తుగూ లేఖ రాశారని..అలాగే డిండి..పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వొద్దని చంద్రబాబు లేఖలు రాశారని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నుంచి, గ్రీన్ ట్రిబ్యూనల్ నుంచి, సీడబ్ల్యుసీల నుంచి అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతులపై ఏపీకి ఒక నీతి.. తెలంగాణకు మరొక నీతి అన్నట్లుగా వ్యహరిస్తోందని, ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. లక్ష 60 వేల కోట్లు ఏపీకి కేంద్రం ఇస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 80వేల కోట్లతో నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50శాతం నిధులు, మిగతా 50శాతం ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయం, అనైతికమని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటే, ఎఫ్ ఆర్ బీ ఎం కింద రికవరీ పెట్టారని.. కానీ బనకచర్ల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా 50శాతం ఎఫ్ ఆర్ బీఎం పరిమితి మించి రుణం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని హరీష్ రావు నిలదీశారు.
అనుమతి లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయమా?
కేంద్రం తన చేతుల్లో ఉందని.. ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. అనుమతులు లేని బనకచర్లకు కేంద్రం రుణాలు కూడా అందిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా.. అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోందని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు నష్టం జరుగుతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ఏడాది తెలంగాణ 65 టీఎంసీల నీటిని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మళ్ళీ జలదోపిడీ మొదలైందని, గతంలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకాని తనం వలన 200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతోందని, అదే సమయంలో గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీష్ రావు ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం, కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమని గుర్తు చేశారు. కానీ అందుకు విరుద్దంగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం, నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమని హరీష్ రావు విమర్శించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి బనకచర్లను అడ్డుకోకపేతో ఏం లాభం? అని నిలదీశారు.