ముంబై: ఐటీ సేవలు, కన్సల్టింగ్, వ్యాపార పరిష్కారాలలో ఒకటైన దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ జనరేటివ్ ఏఐ అనువర్తనాలలో అగ్రగామిగా ఉన్న వియనై సిస్టమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారం అత్యాధునిక జనరేటివ్ ఏఐ టూల్స్‌తో మానవ ఆలోచనా శక్తిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా టీసీఎస్ కస్టమర్లు వియనై హిలా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి, తమ డేటా నిల్వ నుండి ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. హిలా, అధునాతన డేటా విశ్లేషణలతో సంభాషణ సామర్థ్యాన్ని మిళితం చేస్తూ, ఫైనాన్స్, విక్రయాల రంగాలలో సహాయపడుతుంది. టీసీఎస్ ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఆర్థిక సంస్థలు, ఇతర కీలక రంగాల అవసరాలకు అనుగుణంగా మారుస్తుంది.
అంతేకాక సీఆర్‌ఎం, విక్రయాలు, సరఫరా గొలుసు వంటి ప్రధాన వ్యాపార రంగాలకు ఉపయోగపడనుంది. ఈ విషయంపై టీసీఎస్ సీఈవో, ఎండీ కృతివాసన్ మాట్లాడుతూ.. “డేటాను సహజంగా, సులభంగా అర్థమయ్యేలా మార్చడం ఈ ఒప్పందం ఉద్దేశం. వియనైతో మా భాగస్వామ్యం ఈ కలను సాకారం చేస్తుంది. సీఎక్స్‌ఓలు తమ డేటాతో, వేగవంతమైన సమాధానాలు పొందగలరు. జనరేటివ్ ఏఐ వినియోగం ద్వారా, సంక్లిష్టతను తగ్గించి, మానవ కేంద్రీకృత విధానంతో వృద్ధి సాధించగలం” అని అన్నారు.
కచ్చితత్వం, వేగం..
వియనై సిస్టమ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డా.విశాల్ సిక్కా మాట్లాడుతూ… “టీసీఎస్‌తో భాగస్వామ్యం మాకు గర్వకారణం. హిలా పూర్తి సామర్థ్యాన్ని ఈ సహకారం అన్‌లాక్ చేస్తుంది. వ్యాపార వినియోగదారులు తమ లావాదేవీ డేటాతో కచ్చితత్వం, వేగం, భద్రత, తక్కువ ఖర్చుతో సంభాషించడానికి హిలా వీలు కల్పిస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఎంటర్‌ప్రైజ్‌లకు సరళత, విశ్వాసంతో కూడిన వృద్ధి, ఆవిష్కరణలకు సహకారం కల్పిస్తుంది. సాంకేతికతను ఉపయోగించుకుని అద్భుతాలు చేయాలనే మా కలను సాకారం చేస్తుంది” అని పేర్కొన్నారు.