Site icon vidhaatha

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి హవా!

విధాత: ఏపీలో వైసీపీ ఖాతాల్లోని మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు అవిశ్వాసాల పర్వం అనంతరం అధికార టీడీపీ కూటమి ఖాతాలో చేరుతున్నాయి. వైసీపీ ఆధీనంలోని కుప్పం, తుని, మాచర్ల, మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు విశాఖ, గుంటూరు కార్పోరేషన్ మేయర్ పదవులు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ హస్తగతమమ్యాయి. కుప్పం మున్సిపల్ చైర్మన్‍గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్ గా నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు. మాచర్ల మున్సిపాలిటీ చైర్మన్ గా షేక్ మదార్ సాహెబ్ ఎన్నికయ్యారు.

గుంటూరు నూతన మేయర్‌గా టీడీపీ నుంచి కూటమి కార్పొరేటర్ల మద్దతుతో కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. విశాఖ పట్నం జీవీఎంసీ నూతన మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా ఆకుల మల్లీశ్వరి ఎన్నికయ్యారు. మొత్తం మీద వైఎస్సార్‌సీపీ ఖాతా నుంచి రెండు కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ చేజారిపోయాయి.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా స్థానిక సంస్థల్లో కూడా కార్పోరేటర్లు, కౌన్సిలర్లు పార్టీ మారి అధికార టీడీపీ కూటమిలో చేరిపోవడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్, చైర్మన్ పదవులు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి.

Exit mobile version