ఏపీలో కూటమి పార్టీల్లోని లుకలుకలు క్రమంగా బయటపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ జరుగుతుండటంగా తాజాగా ఈ యుద్ధం రచ్చకెక్కుతున్నది. టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో టీడీపీ ఎక్కువగా నష్టపోతున్నదని వ్యాఖ్యానించారు.
గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు పొత్తు పేరిట ఇతర నేతలకే అవకాశాలు దక్కుతున్నాయంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చాలా రోజులుగా పార్టీపై అసహనంతో ఉన్నారు.
తనకు పదవి దక్కలేదని ఇప్పటికే పలుమార్లు ఆక్రోషం వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ మినీ మహానాడులోనూ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. పొత్తులు ఎన్ని రోజులు ఉంటాయో తనకు తెలియదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి దక్కుతున్నాయో.. అందరకి తెలుసునని వ్యాఖ్యానించారు. పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్వీర్యం అవుతోందని అన్నారు.