Fake Liquor Case | జోగి రమేశ్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశా : నకిలీ లిక్కర్ కేసు ఏ-1 జనార్ధన్

ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఏ-1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాల్నీ ఒక వీడియో రూపంలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో ఏపీలోని రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది.

Janardhan Rao Shocking Facts About AP Fake Liquor Case

Janardhan Rao Shocking Facts About AP Fake Liquor Case

అమరావతి : ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఏ-1 గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాల్నీ ఒక వీడియో రూపంలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో ఏపీలోని రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. వైసీపీ పాలనలో జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారీ చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏపీలో ప్రభుత్వం మారగానే నకిలీ మద్యం తయారీ నిలిపివేశామన్నారు.

అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేశ్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయమన్నారని జనార్దన్ రావు చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కుట్రతో.. మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేశ్ తనతో చెప్పారని ఆరోపించారు. ‘ఇబ్రహీంపట్నంలో పెట్టాలని అనుకున్నా కానీ, జోగి రమేశ్ ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాం. తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ప్రభుత్వంపై బురద జల్లొచ్చని జోగి రమేశ్ అన్నారు.

రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చాం. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయట పడేస్తానని జోగి రమేశ్ నాకు హామీ ఇచ్చారు. అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపారు. జోగి రమేశ్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు’ అని జనార్థన్ రావు సంచలన విషయాలు వీడియో ద్వారా బయటపెట్టారు.

అలాగే, టీడీపీ నేతలను సస్పెండ్ చేయడంతో జోగి రమేశ్ మరో ప్లాన్ వేశారన్నారు. ‘ఇబ్రహీంపట్నంలోనూ రైడ్ చేయిద్దామని, సరకు అక్కడికి తీసుకొచ్చిపెట్టు అని చెప్పారు. జోగి రమేశ్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. అప్పుడు సాక్షి మీడియా ముందే వచ్చింది.. అనుకున్నది జరిగింది.. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. నా తమ్ముడిని కూడా నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ ఇరికించాడు. జైచంద్రారెడ్డికి నకిలీ మద్యంతో అసలు సంబంధం లేదు’ అని జనార్దన్ రావు చెప్పుకొచ్చారు.