- పరిపాలనలో పట్టుకు తన ముద్ర
- నేడో రేపో భారీగా జిల్లా కలెక్టర్ల బదిలీ
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విధాత): ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి లీకు వీరులపై వేటు వేయడం మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. పరిపాలనా యంత్రాంగంపై తన పట్టు పెంచుకునేందుకు సచివాలయంలో బదిలీలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మార్పులకు శ్రీకారం చుట్టారు. నేడో రేపో జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేయవచ్చని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా గత బీఆర్ఎస్ ప్రభుత్వ లక్షణాలు అధికారవర్గాల్లో పోలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. పాత ప్రభుత్వమే కొనసాగుతున్నదా? అనే విధంగా సచివాలయం మొదలు గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయంలో ఉన్నత స్థాయిలో జరిగే సమావేశాల వివరాలు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పెద్దలకు వెళ్ళడం, వాళ్లు అప్రమత్తమై దిద్దుబాటుకు దిగడం జరుగుతోంది.
కొన్ని సందర్భాల్లో తమకు అందిన సమాచారంతో ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారన్న అనుమానాలూ ప్రభుత్వ పెద్దల్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి సమాచారం బయటకు వెళ్తుందో తెలియక కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి సైతం తలపట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. జపాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శితో పాటు సచివాలయంలో బదిలీలపై దృష్టి సారించి ఆదేశాలు జారీ చేయించారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావును నియమించారు. ఆ వెంటనే సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయించారు. ప్రధాన కార్యదర్శిగా జయేశ్ రంజన్‌ను నియమించుకోవాలని రేవంత్ రెడ్డి అనుకోగా సాధ్యం కాలేదు. దీంతో ఆయను పరిశ్రమలు, పెట్టుబడుల సెల్‌తోపాటు పాటు స్పీడ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రితోపాటు జాయింట్ సెక్రటరీగా ఎస్ సంగీత సత్యానారాయణ పనిచేస్తున్నారు. సంగీతను అక్కడి నుంచి తప్పించి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం డైరెక్టర్ గా బదిలీ చేశారు. సాధారణంగా అఖిల భారత సర్వీసులో సీనియర్ అధికారికి గౌరవం ఇవ్వడం విధానపరంగా కొనసాగుతూ వస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గతంలో మాదిరి పనిచేస్తారా లేదా జయేశ్ రంజన్‌దే పై చేయి ఉంటుందా అనేది చూడాలి.
నిర్ల్యక్ష్యానికి మూల్యం?
తన, మన అనే తేడా లేకుండా పలువురు ఐఏఎస్ లకు అవకాశాలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోవడం లేదనే నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారని తెలుస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాదిన్నర అవుతున్నా కొందరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా పనిచేయడం, ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆగ్రహాన్ని తెప్పించిందంటున్నారు. విధాన పరమైన నిర్ణయాలు, కీలకమైన అంశాలను గంటల వ్యవధిలో బీఆర్ఎస్ నాయకులకు చేరవేస్తున్నారనే దానిపై స్పష్టమైన సమాచారం ముఖ్యమంత్రికి అందిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తనవద్ద ఉన్న సమాచారంపై మరోసారి విశ్లేషించి, ప్రభుత్వ రహస్యాలు బయటకు ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నవారిపై వేటు వేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చారని ఆ వర్గాల కథనం. డబ్బుల సంపాదనే ధ్యేయంగా కొందరు ఐఏఎస్‌లు పనిచేస్తున్నారని గతంలో విమర్శించిన ఆయన.. తాజా బదిలీల్లో భాగంగా వీరిపై కూడా వేటు వేయడం సచివాలయంలో సంచలనంగా మారింది.
నేడో రేపో జిల్లా కలెక్టర్ల బదిలీలు!
సమర్థత ఆధారంగా సగం జిల్లాల కలెక్టర్లను బదిలీలు చేసేందుకు కసరత్తు కూడా పూర్తయిందని చెబుతున్నారు. మెజారిటీ జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు నిర్వహించడం లేదు. ప్రజలతో ముఖాముఖి కావాలని చెప్పినప్పటికీ విన్పించుకోకుండా ఏసీ గదుల్లోనే పరిపాలన సాగిస్తున్నారని ముఖ్యమంత్రి గతంలో అసంతృప్తిని బహిరంగంగా వెలిబుచ్చారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిపాలనలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించారు.
తన ముద్ర స్పష్టంగా కన్పించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ల బదిలీలతో పాటు సచివాలయంలో మరోసారి బదిలీలు చేయవచ్చని అంటున్నారు. ఆ బదిలీలు ఒకటి రెండు రోజులు లేదా వారం రోజుల్లో పూర్తి చేయవచ్చని సచివాలయంలో అధికారులు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి పేషీతో పాటు గత మున్సిపల్ వ్యవహారాల మంత్రి హయాంలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పూర్తిగా తొలగించారు. వారందరినీ సంబంధిత శాఖకు వెనక్కి పంపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ ఉన్నారనే దానికి ఇలాంటి ఉదాహారణలు ఎన్నో ఉన్నాయి.