IPL | HCA | SUN RISERS
విధాత: సన్ రైజర్స్ హైదరాబాద్ కు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం మంగళవారం ఉప్పల్ స్టేడియానికి చేరుకుని తమ దర్యాప్తును మొదలు పెట్టింది. ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఏల మధ్య జరిగిన ఈ-మెయిల్స్ చెక్ చేశారు. ఎస్ఆర్ హెచ్, హెచ్ సీఏల మధ్య ఐపీఎల్‌కు ముందు జరిగిన ఒప్పందాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. ఐపీఎల్‌కు ముందు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై కూడా విచారించారు. ఇప్పటికే గత రెండేళ్లుగా హెచ్ సీఏ చేపట్టిన రెనోవేషన్స్ వాటికి సంబంధించిన లెక్కల పరిశీలించారు.
వివాదం ఏమిటి..?
HCA మమ్మల్ని ఫ్రీపాసులు కోసం రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుందని SRH చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఇలాంటి గొడవలు కొనసాగితే తమ హోమ్‌గ్రౌండ్‌ను వేరే వేదికకు తరలిస్తామన్న హెచ్చరికతో సన్ రైజర్స్ HCA కు మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వానికి, బీసీసీఐకు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామని ఆ మెయిల్‌లో SRH హెచ్చరించినట్లు ప్రచారం నెలకొంది. మార్చిన 27న కూడా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా HCA ఫ్రీపాస్‌ల విషయంలో గొడవ చేసిందని.. మ్యాచ్‌కు ముందు ఒక కార్పొరేట్ బాక్స్‌కు హెచ్ సీఏ తాళం వేసిందని, అదనపు టికెట్లు ఇవ్వకపోతే తెరవమని బెదిరించిందని సన్ రైజర్స్ ఆరోపించింది. SRH, HCA సెగలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం తాకాయి. ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ పాసుల విషయంలో సన్ రైజర్స్‌ను ఇబ్బంది పెడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్ సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
HCA ఏమంటోంది..?
సన్ రైజర్స్ హైదరాబాద్ చేస్తున్న ఆరోపణలు హెచ్ సీఏ కొట్టిపారేస్తుంది. ఫ్రీపాస్‌ల విషయంలో తామెవరినీ బెదిరించలేదని.. ఎస్ఆర్ హెచ్ నుంచి ఎలాంటి అధికారిక ఈ-మెయిల్ రాలేదని స్పష్టం చేసింది. అలాగైతే హెచ్ సీఏ పై ఒత్తిడి పెంచేందుకు SRH వ్యూహాత్మకంగా ఈ మెయిల్ లీక్ చేసిందా అన్న చర్చ కూడా సాగుతోంది. మామూలుగా HCAతో ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10%.. అంటే సుమారు 3,900 టికెట్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇందులో F12A కార్పొరేట్ బాక్స్‌లో 50 సీట్లు ఉన్నాయి. కానీ ఈ సీజన్‌లో ఆ బాక్స్ సామర్థ్యం 30 సీట్లేనని, అదనంగా 20 సీట్లు మరో బాక్స్‌లో ఇవ్వాలని హెచ్ సీఏ కోరింది. ఎస్ఆర్ హెచ్ ఈ డిమాండ్‌ను నిరాకరించడంతోనే మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ రోజున F3 బాక్స్‌కు హెచ్ సీఏకు తాళం వేసిందని సమాచారం. దీంతో సన్ రైజర్స్ అసహనానికి గురై ఫ్రీ పాసుల వివాదాన్ని రచ్చ కెక్కించినట్లుగా తెలుస్తుంది.
సన్ రైజర్స్ వెళితే.. తెలంగాణ రైజింగ్ కు దెబ్బే!
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎల్ ప్రాంచైజీలో హైదరాబాద్ సన్ రైజర్స్ హోం టీమ్ గా కొనసాగుతోంది. దక్కన్ చార్జర్స్ నిష్క్రమణ అనంతరం సన్ రైజర్స్ టీమ్ ను రాష్ట్ర క్రీడాభిమానులు సొంత జట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు HCA టార్చర్ పెడుతుందంటూ SRH హోం గ్రౌండ్ వీడి మరో రాష్ట్రానికి తరలిపోతే ఆ ప్రభావం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన పడుతుందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అసలే తెలంగాణ రైజింగ్ నినాదంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై తనదైన ముద్ర వేసేందుకు పురోగమిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలకు ఐపీఎల్ క్రికెట్ టీమ్ తరలిపోతే ఎదురుదెబ్బ కానుంది. హెచ్ఆర్ఎస్ వివాదంలో బీసీసీఐ స్పందించి మరో వేదిక కేటాయిస్తే.. అందిపుచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండటం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ కు హెచ్ సీఏకు మధ్య నెలకొన్న వివాదంపై సీరియస్ గా స్పందించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెడకుండా ఐపీఎల్ టీమ్ సమస్యలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారని విశ్లేషకులు చెబుతున్నారు.
సద్దుమణిగిన వివాదం
అయితే.. HCA, SRH మధ్య వివాదం సద్దుమణిగింది. మంగళవారం సాయంత్రం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అదేవిధంగా స్టేడియం సామర్థ్యంలో 10శాతం టికెట్లను..తమకు కేటాయించాలని SRH ప్రతినిధులు కోరగా ప్రస్తుత కేటాయింపులు యథాతథంగా ఉంచాలని HCA తెలిపింది. అయితే హెచ్‌సీఏకి 3,900 ఉచిత పాస్‌ల కేటాయించారు.