విధాత: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో 14వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు వెళ్లనున్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు అంశంపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగి వచ్చే వరకూ సమ్మె చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.
ఇదిలా ఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ లో గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. తాజాగా మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపు 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కూడా కార్మికుల తొలగింపు ఆగకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధపడ్డాయి. తొలగించిన కార్మిక సంఘాలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమ్మెకు ఉక్కు ఫ్యాక్టరీ పోరాట కమిటీ మద్ధతు తెలిపింది. కాంట్రాక్టు కార్మికుల సమ్మె నేపథ్యంలో యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. రెగ్యులర్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.