విధాత: మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కళాశాల (వీబీఐటీ) వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కళాశాల హాస్టల్ విద్యార్ధినిల నగ్న వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఘట్ కేసర్ వీబీఐటీ కళాశాల విద్యార్ధులు ఆందోళనకు దిగారు. విద్యార్థినిలు స్నానాలు చేస్తున్న సమయంలో వార్డెన్, స్టాఫ్, లెక్చరర్లు వారి నగ్న చిత్రాలు తీశారని విద్యార్థినిలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 15 మంది విద్యార్థులను యాజమాన్యం హాస్టల్ లో బంధించడం మరింత వివాదస్పదమైంది.
వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో 2023జనవరిలోనూ ఇదే తరహా ఘటన తీవ్ర వివాదం రేపింది. కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినుల ఫోటోలను కొంత మంది యువకులు సేకరించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పట్లో ఆ కేసులో నలుగురు యువకులకు పోలీసులు అరెస్టు చేశారు. మళ్లీ ఇదే కళాశాలలో అమ్మాయిల నగ్న వీడియోల వ్యవహారం రచ్చకు దారితీయడం గమనార్హం.