Site icon vidhaatha

Gold ATMs: ఇక‌.. AI సాయంతో ATMలో గోల్డ్ లోన్లు.. నిమిషాల్లో ఖాతాల్లోకి డ‌బ్బులు!

Gold ATMs:

విధాత: ప్రస్తుతం నగదు విత్ డ్రా, డిపాజిట్లతో పాటు బంగారం కొనుగోలుకు కూడా ఏటీఎంలు వినియోగించడం మనం ఇప్పటిదాకా చూశాం. కొత్తగా గోల్డ్ లోన్లు (Gold Loans) ఇచ్చే ఏటీఎం (ATM)లు కూడా రంగ ప్రవేశం చేస్తున్నాయి. మనం సాధారణంగా గోల్డ్ లోన్ల కోసం బ్యాంకుల వద్ధకు, రుణ సంస్ధల వద్ధకు వెళ్లి నగలు కుదువ పెట్టి అప్రెయిజర్ వాటిని పరిశీలించాక రుణం పొందడం జరుగుతుంది.

అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)తో వస్తున్న ఏటీఎంలు గోల్డ్ లోన్స్ ఇస్తుండటం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గోల్డ్ లోన్ ఏటీఏం దేశంలోనే తొలిసారిగా వరంగల్ లో అందుబాటులోకి వచ్చింది. వరంగల్ లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ దీనిని ప్రారంభించింది. ఏఐ ఆధారిత గోల్డ్ లోన్ సేవలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి.

ఏటీఎం మెషిన్ లో అమర్చిన ఓ బాక్సులో వేసే బంగారు ఆభరణాలు నాణ్యత, బరువు ను ఏఐ సాంకేతిక ఆధారంగా నిర్ధారిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధరను అంచనా వేసి ఎంత రుణం వస్తుందో డిస్ ప్లే అవుతుంది. మనం అంగీకరించగానే 10% నగదు ఏటీఎం నుంచి విత్ డ్రా అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా 12 నిమిషాల్లో జరిగిపోతుంది. మిగతా 90% నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఈ ఏటీఎం సేవను ఉపయోగించుకోవడానికి వినియోగదారులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారులు అయి ఉండాలి. ఏఐ ఆధారిత గోల్డ్ లోన్ల వల్ల అప్రైజర్లు నాణ్యత, బరువు నిర్ధారించాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు కస్టమర్ గోల్డ్ లోన్ కోరుకున్న కొద్ది నిమిషాల్లోనే నగదు పొందేందుకు వీలుంటుంది. ఏఐ గోల్డ్ లోన్ ఏటీఎం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Exit mobile version