Visakhapatnam Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. మంగళవారం నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. వారి సమ్మెకు సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సైతం ఒకరోజు సమ్మె చేపట్టనున్నారు. ఉద్యోగులకు నోటీసులు.. కార్మికుల తొలగింపునకు నిరసనగా విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.
తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని, 2021 జనవరిలో తీసుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలన్న డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోని ప్రధాన ఉక్కు కర్మాగారాల్లో ఒకటి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రాష్ట్రీయ ఇస్సాత్ నిగం లిమిటెడ్ కింద ఇది నడుస్తున్నది. 1971లో స్థాపించిన ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా కార్మికులు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు.