Site icon vidhaatha

రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు- ఈ విజయం వెనుక ఇరువురు మహానుభావుల కృషి

విధాత;కాకతీయుల కాలంలో 1213వ సంవత్సరం లో రామప్ప అనే శిల్పి నైపుణ్యం తో తయారైన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం తెలుగు వారందరికీ గర్వ కారణం! ఇందుకు కృషి చేసిన అధికారుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వరకు అందరిని అభినందించాల్సిందే! పత్రికలూ, ఛానెల్స్, ప్రజలు అందరూ అదే చేస్తున్నారు, సంతోషం! అయితే, రామప్ప విశిష్టతను వెలుగులోకి తీసుకొచ్చిన ఇద్దరు మహానుభావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి! అవును,అందులో ఒకరు భరత కళాప్రపూర్ణ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ , ఇంకొకరు పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణ రెడ్డి ! ఇప్పుడు సంతోషించేందుకు వారిద్దరూ లేరు! వారే ఉండి ఉంటే,ఈ ఆనంద సమయం ఇంకో సందడి తో నిండి ఉండేది! ఇవాళ రామప్ప దేవాలయం లో నృత్య హారతులు మార్మోగేవి!

పేరిణి నాట్య వైభవాన్ని పునః సృష్టించిన నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ ఈ ఆలయ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారు. 1984లో రామప్ప దేవాలయం లో నృత్యోత్సవాలు నిర్వహించి లక్షల మంది దృష్టి ని అడుగులను గుడి వైపు నడిపించారు! రామప్ప దేవాలయం పై పరిశోధనలు చేసి ప్రత్యేక గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు!

జ్ఞానపీఠ మహాకవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి 1960 లోనే రామప్ప దేవాలయం వైభవాన్ని నృత్య రూపకంగా, కవితాత్మకంగా మలిచారు! అప్పుడే రామప్ప దేవాలయం చారిత్రాత్మక వైభవం వెలుగులోకి వచ్చింది! నటరాజ రామకృష్ణ కృషితో ప్రపంచ పర్యాటకులు,ముఖ్యంగా నృత్య కళాకారులు,కళాభిమానుల్లో రామప్ప ను ప్రత్యేకంగా సందర్శించాలనే అభిలాష పెంపొందింది!

అలాగే, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి , IPS రిటైర్డ్ అధికారులు సి. ఆంజనేయరెడ్డి ,బి.పాపారావు చేసిన కృషి, చూపించిన శ్రద్ధ ఫలితమే నేటి యునెస్కో గుర్తింపు అని కూడా మరచిపోకూడదు!

అలాగే తుది పరిశీలనలో పాల్గొని గుడిని చూసి మైమరచి పోయి అద్భుత నివేదిక సమర్పించిన ప్రఖ్యాత నృత్య కళాకారులు నంద గోపాల్ గారి కృషి ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి,కృతఙ్ఞతలు తెలియచేయాలి!ఎందుకంటే తొలుత 2016లో ప్రభుత్వం సమర్పించిన నివేదిక సరి లేదని తిరస్కరించింది యునెస్కో! నాట్య చూడామణి నంద గోపాల్ ఆలయాన్ని సందర్శించి నాట్య శిల్ప వైభవాన్ని,ఆలయ ప్రత్యేకతలను సవరించి ఇచ్చిన తుది నివేదిక ఫలితం ఇవాళ్టి ప్రపంచ వారసత్వ గుర్తింపు! ఇలా ఎందరో మహానుభావులు …ఆలయ విశిష్టతను కాపాడుతూ వచ్చారు! ఆలయ పూజారి నుంచి మన ముఖ్యమంత్రి కె సి ఆర్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వరకు అందరికి ధన్యవాదాలు,కృతజ్ఞతాభి వందనాలు!

ఇది ఎంతో సంతోషించాల్సిన శుభ సమయమని,నాట్య గురుదేవులు డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉంటే ఎంతో సంతోషించే వారని,వారు చేసిన కృషి చరిత్ర మరవలేదని ప్రముఖ నాట్యాచార్యులు,కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత కళాకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. నటరాజ రామకృష్ణ రామప్ప దేవాలయ వైభవాన్ని వెలుగులోకి తీసుకొచ్చారనే చారిత్రాత్మక వాస్తవాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Exit mobile version