BRS | వేములవాడలో చెన్నమనేని.. జగిత్యాలలో చలిమెడ వర్గీయుల సమావేశం

BRS | సీటుపై సిటింగ్ ఎమ్మెల్యే అనుచరుల్లో గుబులు కేటీఆర్ ను కలిసే ప్రయత్నాలు విఫలం నేరుగా పార్టీ అధినేతనే కలవాలని నిర్ణయం విధాత బ్యూరో, కరీంనగర్: వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యునిగా గెలుపొందినా, ఈసారి టికెట్ దక్కుతుందో, లేదో అనే ఆందోళన వేములవాడ సిటింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును వెన్నాడుతోంది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన జరుగుతున్న పరిణామాలతో జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం ఆయన మద్దతుదారులు ఎమ్మెల్యే స్వగృహం సంగీత […]

  • Publish Date - August 20, 2023 / 12:45 PM IST

BRS |

  • సీటుపై సిటింగ్ ఎమ్మెల్యే అనుచరుల్లో గుబులు
  • కేటీఆర్ ను కలిసే ప్రయత్నాలు విఫలం
  • నేరుగా పార్టీ అధినేతనే కలవాలని నిర్ణయం

విధాత బ్యూరో, కరీంనగర్: వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యునిగా గెలుపొందినా, ఈసారి టికెట్ దక్కుతుందో, లేదో అనే ఆందోళన వేములవాడ సిటింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును వెన్నాడుతోంది. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన జరుగుతున్న పరిణామాలతో జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం ఆయన మద్దతుదారులు ఎమ్మెల్యే స్వగృహం సంగీత నిలయంలో సమావేశమై భవిష్యత్తు వ్యూహంపై చర్చలు జరిపారు.

ఈసారి వేములవాడ టికెట్ చలిమెడ లక్ష్మీనరసింహారావుకు కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు పార్టీ అధిష్టానం నుండి సంకేతాలు వెలువడుతుండడంతో, చలిమెడ రాజకీయంగా దూకుడు పెంచారు. ఆదివారం ఆయన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మేడిపల్లి, భీమారం మండలాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో జగిత్యాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

సిటింగ్ ఎమ్మెల్యే వర్గం వేములవాడలో, టికెట్ ఆశిస్తున్న చలిమెడ జగిత్యాలలో ఒకేరోజు సమావేశాలు ఏర్పాటు చేయడం వేములవాడ నియోజకవర్గ రాజకీయాలలో వేడి పుట్టించాయి. బీఆర్ఎస్ తొలివిడత అభ్యర్థులను ప్రకటించే నియోజకవర్గాల్లో వేములవాడ ఉంటుందని, చలిమెడ లక్ష్మీనరసింహారావును తమ అభ్యర్థిగా పార్టీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

ఈ క్రమంలోనే చలిమెడకు మద్దతుగా వేములవాడ పట్టణంలో ఫ్లెక్సీలు వెలుస్తుండడం ఆసక్తికర పరిణామం. కూతురు గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు శాసనసభ్యుడు రమేష్ బాబు జర్మనీ వెళ్లడంతో, జరుగుతున్న పరిణామాలతో ఆయన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు.

మూడు రోజుల క్రితం సిరిసిల్లలో వారు మంత్రి కే తారక రామారావును కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో మరింత ఆందోళనకు గురైన రమేష్ బాబు వర్గీయులు ఆదివారం ఆయన స్వగృహంలో సమావేశమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని జడ్పీటీసీలు, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్, పార్టీ మండల స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొని జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.

రమేష్ బాబుకు టికెట్ కోసం అవసరమైతే నేరుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును కలవాలనే నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో సుమారు 100 మందికి పైగా నేతలు పాల్గొన్నట్లు తెలియవచ్చింది. వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైన రమేష్ బాబుపై పార్టీ కేడర్ లో కొంత వ్యతిరేకత రావడం, ఆయన పౌరసత్వ సమస్య నేటికీ కొలిక్కి రాకపోవడంతో ఆయనను మార్చాలనే నిర్ణయానికి పార్టీ అధిష్టానం వచ్చిందనే సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

పార్టీ అధిష్టానం పరోక్ష మద్దతుతో లక్ష్మీనరసింహారావు ఏకంగా వేములవాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే ఇటీవల జర్మనీ పర్యటనకు వెళ్లడంతో చలిమెడ తన కార్యక్రమాలలో వేగం పెంచారు.

లక్ష్మీ నరసింహారావు రంగ ప్రవేశం చేసిన తొలినాళ్ళలో, ఆయనను పెద్దగా పట్టించుకోని, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వని ఎమ్మెల్యే, ఆయన అనుచర వర్గం జరుగుతున్న పరిణామాలు చూసిన అనంతరం జావగారి పోయే పరిస్థితికి వచ్చారు. దీంతో మరోసారి టిక్కెట్ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ఆరంభించారు. మొత్తం మీద రెండు శిబిరాల మోహరింపుతో వేములవాడ అధికార పార్టీ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి.

సంపూర్ణ మద్దతు చెన్నమనేనికే.. వేములవాడలో బీఆర్ఎస్ శ్రేణుల ప్రకటన

విధాత బ్యూరో, కరీంనగర్: సర్వేలు, ప్రజాభిప్రాయం శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబుకే అనుకూలంగా ఉందని, ఆయనకే ఈసారి టికెట్ కేటాయించాలని వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలువురు అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలుపు చెన్నమనేనిదే అని వారు తెగేసి చెప్పారు.సిటింగులకే సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రమేష్ బాబుకు ఈసారి మళ్లీ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

మండల పార్టీ అధ్యక్షులు సత్తిరెడ్డి, పుల్కం రాజు, గోస్కుల రవి, మల్యాల దేవయ్య, మేకల ఎల్లయ్య, దయాల కమలాకర్, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి రాజు, జడ్పీటీసీలు నాగం భూమయ్య, గట్ల మీనయ్య, మేకల రవి, యాస వాణి, ఎంపీపీలు జవ్వాజి రేవతి, గంగం స్వరూప మహేష్, బూర వజ్రవ్వ, ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, బైరగొని లావణ్య రమేష్, కౌన్సిలర్లు జయ సలీం, జోగిని శంకర్,

జెడల లక్ష్మి శ్రీనివాస్, కంకనాల శ్రీలత క్రాంతి, మారం కుమార్, కొండ కనకయ్యతో పాటు పలువురు నేతలు ఆదివారం శాసనసభ్యుడు చెన్నమనేని స్వగృహం సంగీత నిలయంలో సమావేశమయ్యారు. వేములవాడ టికెట్ మరొకరికి కేటాయించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో అప్రమత్తమైన వారు, తమ అందరి మద్దతు చెన్నమనేనికే అని స్పష్టం చేశారు.

Latest News