అందరికీ మంచి చేసినా.. ఏమైందో తెలియట్లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై.. సీఎం జగన్

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు మంచి చేసినా ఏమైందో తెలియట్లేదని, ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామని, పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియట్లేదని, ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు

  • Publish Date - June 4, 2024 / 07:26 PM IST

విధాత : రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు మంచి చేసినా ఏమైందో తెలియట్లేదని, ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నామని, పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియట్లేదని, ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఎన్నడూ చూడని విధంగా.. చేయని విధంగా మంచి చేశానని, సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి కోట్ల మంది లబ్ధి చేకూర్చినా తనకు ఓట్లు పడలేదన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశామని, రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నామని, అరకోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదని నిర్వేదం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలు, ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నామని, ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయామని వాపోయారు. మ్యానిఫెస్టో హామీలను 99 శాతం అమలుచేశామని, పేద పిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశామని, గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేశామని గుర్తు చేసుకున్నారు. అయినా ప్రజల తీర్పును తాము తీసుకుంటామని, మంచి చేయడానికి ఎప్పుడూ ముందుంటామని, పేదవాడికి అండగా ఉంటూ గళం విప్పుతామన్నారు. కూటమిలోని బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అబినందనలని, ఎన్ని చేసినా మా ఓటు బ్యాంకును 40 శాతానికి తగ్గించలేకపోయారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకుసాగుతామని జగన్ వ్యాఖ్యానించారు.

Latest News