6.47 లక్షల రేషన్ కార్డులను కేసీఆర్ హయాంలో పంపిణీ
ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీకి రానివ్వను!
విధాత, హైదరాబాద్ : కేసీఆర్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేశామని..నా వాదన తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బలు తింటానని..నిజమైతే కాంగ్రెస్ నేతలు చెంప దెబ్బలకు సిద్దమా? అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి(BRS MLA Jagadish Reddy ) సవాల్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని నిసిగ్గుగా అబద్దాలు చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. జూలై 2021 లో ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తన నియోజకవర్గంలో రేషన్ కార్డులు(Ration card) పంచినట్టు అప్పట్లో ట్వీట్ చేశారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) మాజీ ఎంపీగా బీఆర్ఎస్ లో ఉన్నపుడు రేషన్ కార్డుల పంపిణీ గురించి ప్రత్రికల్లో ప్రకటనలు ఇచ్చారన్నారు. చౌటుప్పల్ లో అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో నేను రేషన్ కార్డులు పంపిణీ చేశానని జగదీష్ రెడ్డి వెల్లడించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ,ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. రేవంత్ స్థాయికి దిగజారి నేను మాట్లాడాలని కొందరు కోరుకుంటున్నారని..కాని.నేను అలా చేయబోనని…రేవంత్ మాట్లాడింది ప్రతిదీ అబద్దమని సాక్ష్యాలతో నిరూపించానని చెప్పుకొచ్చారు. నిన్న రేషన్ కార్డుల పంపిణీ పేరుతో ప్రభుత్వ ఖర్చుతో సీఎం సభకు జనాలను తీసుకొచ్చారన్నారు. సీఎం అబద్దాలు మాట్లాడుతుంటే ప్రజలు స్పందించలేదన్నారు. సీఎం లేని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు మాలిన చర్య అని..బూతులు తిడితేనైనా స్పందిస్తారని సీఎం బూతులకు తెగ బడ్డారన్నారు. సీఎం కు సంస్కారం ,బుద్ది పెరగలేదన్నారు. ఆయనను రోత మాటల రేవంత్ రెడ్డిగా పిలుచుకుంటున్నారన్నారు.
ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వం
నేను సోడా కలిపానో ,నీళ్లు కలిపానో పక్కన బెడితే..సీఎం రేవంత్ మాదిరిగా గురు దక్షిణ కింద కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి తరలించలేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. బనక చర్ల పై చంద్రబాబు రాసిచ్చిన వాఖ్యలనే రేవంత్ చదువుతున్నారు. తాను ఏదీ మాట్లాడినా రాసే ,చూపే భాజా బజంత్రీ మీడియా ఉందనే అహంకారంతో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. జిల్లా నుంచి ఒక్కడినే గెలిచానంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ మహామహులనే మట్టికరిపించానని..భవిష్యత్ లో కూడా నేనేంటో నిరూపిస్తానని..వచ్చే ఎన్నికల్లో నల్లగొండ(Nalgonda) నుంచి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీకి రానివ్వనని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) చెప్పిన తెలంగాణ సాయుధ పోరాట యోధులంతా పోరాడింది కాంగ్రెస్ జమీందార్ల మీదేనని…ఒక్కో సారి మనం ఎంత మంచిగా పంట సాగు చేసినా పంట కంటే లొట్ట పీసు చెట్లే ఎక్కువగా మొలుస్తాయని ఎద్దేవా చేశారు. ఇపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రూపంలో నల్లగొండ జిల్లాలో లొట్ట పీసు చెట్లు మొలిచాయన్నారు. నా ఆస్తులు.. రేవంత్ ఆస్తుల గురించి మీడియానే నా గ్రామం ,రేవంత్ గ్రామం వెళ్లి విచారణ చేయాలని…సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞతతో మాట్లాడితే మంచిదన్నారు. నల్లగొండ జిల్లా లో ఇపుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ అన్ని స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఎన్నికలు వచ్చినపుడు ఎవరి సంగతి ఏమిటో ప్రజలే తేలుస్తారని..కాంగ్రెస్ ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోమన్నారు.
కాళేశ్వరం జలాలపై చర్చకు సిద్దం
గతంలో కేసీఆర్(KCR) జిల్లా పర్యటనలకు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు ప్రకటించే వారని..నిన్న సీఎం తుంగతుర్తిలో తిట్లు తప్ప ఏమీ ఇవ్వలేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ టీడీపీ పాలన వల్లే నల్లగొండలో ఫ్లోరోసిస్ మహమ్మారి 2 లక్షల మందిని కబళించిందన్నారు. నీళ్ల విషయంలో అన్యాయం చేసి మళ్ళీ ఏవో మాటలు చెబుతున్నారన్నారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే నల్లగొండను 40 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన వచ్చాక ఒక్క ఎకరాకు అయినా అదనంగా నీరొచ్చిందా ? అని ..నల్లగొండ జిల్లాకు వచ్చిన కాళేశ్వరం జలాలకు కేసీఆర్ హారతి ఇచ్చిన దృశ్యాలు చూడలేదా ? అని ప్రశ్నించారు. మూడు మెడికల్ కళాశాలలు జిల్లాకు తెచ్చింది కేసీఆర్ కాదా ? అని…యాదాద్రి ని అద్భుత దైవ క్షేత్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారని, ఎన్నికల కోసం వేసిన రైతు భరోసా పాతది…యాసంగి ది వానా కాలం భరోసా డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇంకా 27 వేల కోట్ల రూపాయలు రేవంత్ ప్రభుత్వం బాకీ ఉందన్నారు. కేసీఆర్ పాలన లో నల్లగొండలో ఎలాంటి రాజకీయ కక్షలకు సంబంధించిన కేసులు లేవని..కాంగ్రెస్ నేతలు సీఎం సభ రోజు కూడా తన్నుకున్నారన్నారు.
పదేళ్ల పాలన లో మాది నీళ్ల కోసం ఆరాటం ..ఇపుడు కమీషన్ల కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటం అని విమర్శించారు. కాళేశ్వరం సాక్షిగా నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నానని..కేసీఆర్ కు మూడు రోజులు టైమ్ ఇస్తే కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేసి చూపిస్తామని…ఏ పంప్ హౌజ్ ల దగ్గరైనా చర్చ పెడదాం అని..కాళేశ్వరం లో అన్నీ బాగానే ఉన్నాయని..ఏవీ కులలేదని నిరూపిస్తామన్నారు. గోదావరిని కావాలనే ఎండబెడుతున్నారని..సీఎం వచ్చినా సరే ,మంత్రి వచ్చినా సరే రైతు సమక్షంలో దీనిపై చర్చకు సిద్ధం అన్నారు. కాళేశ్వరం విషయంలో ఎవరిది తప్పయినా రైతు చేతిలో చెంప దెబ్బ తిందాం అన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత ,ఎన్ .భాస్కర్ రావు ,రవీంద్ర కుమార్ ,కె .ప్రభాకర్ రెడ్డి , నాయకులు ఒంటెద్దు నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.