విధాత, : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో చేసిన విమర్శలపై మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ నది జలాల దోపిడిపై కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అసమర్ధతో రేవంత్ రెడ్డి బూతు పురాణం అందుకున్నాడని జగదీష్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ ను విమర్శించే స్థాయి కాదు. నువ్వు గల్లీ స్థాయి నాయకుడివేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారైనా రేవంత్ రెడ్డి పేరు ఎత్తి విమర్శించలేదన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన కృష్ణా, గోదావరి నీళ్లు దోపిడికి గురవుతుంటే..హక్కులు హరించుకుపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అదేందని అడిగిన వారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఒకవైపు ఏపీ, మరోవైపు ప్రధాని మోదీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చెవిన పెట్టడం లేదన్ని, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే బాధ్యత కేసీఆర్ పైన ఉందన్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే.. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలు తీవ్ర నీటి సమస్యలు తప్పవు అని, దీనిపై కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కనీస అవగాహనా లేదు అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.
కేసీఆర్ లక్ష మందితో గతంలో నల్లగొండలో సభపెడితే కృష్ణ జలాలపై శాసనసభలో తీర్మానం చేశారని చెప్పారు. బనకచర్లపై కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఎదిరించి ఉద్యమం చేపడతామంటే దిగి వచ్చారని అన్నారు. కృష్ణా నదికి చంద్రబాబు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నడని, ఇరిగేషన్ మంత్రి అవగాహన లోపంతో, తెలివి తక్కువ తనంతో 45 టీఎంసీలకు ఒప్పుకొని ఉత్తరం రాసిండని విమర్శించారు. 45 టీఎంసీలకు ఒప్పుకున్నట్లు.. సీఎంకు తెలియకుండానే మీ ఇరిగేషన్ మంత్రి లేఖ రాశాడా? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. 90 టీఎంసీల నీటిని మహబూబ్‌నగర్ రంగారెడ్డిలకు అందించేందుకు గతంలో 27 వేల కోట్లు ఖర్చుపెట్టామని, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయకుండా 40 టీఎంసీలకు ఒప్పుకుని అన్యాయం చేశారన్నారు.
కేసీఆర్ పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డిలలో సభలు పెడితే మీ దొంగతనం బయటపడుతుందనే కాంగ్రెస్ పాలకులు భయపడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో.ప్రజలు రేవంత్ రెడ్డిని బండరాళ్ళు కట్టి మూసీల పడేస్తారు అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం తోలు తీస్తా అన్నాడు తప్ప..” స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు అన్నారు. పోలీసులు, అధికారులు, మీ గూండాలంతా కాంగ్రెస్ కు అనుకూలంగా సర్పంచ్ ఎన్నికల్లో పనిచేశారని, అయినప్పటికి బీఆర్ఎస్ సైనికులు పోరాడి బ్రహ్మాండమైన ఫలితాలు సాధించారని జగదీష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ముందు నీ కుప్పి గంతులు మానుకోవాలని రేవంత్ రెడ్డిని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
Champion Movie Review | ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ: ఫుట్‌బాల్ క్రీడ –తెలంగాణ చరిత్ర మేళవింపు మంచి ప్రయత్నమే..కానీ..!
TGSRTC Recruitment 2025 Notification : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ
