విధాత : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తానన్న వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని.. ఆయన రాక కోసం మేం ఎదురుచూస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా? అని తాము కూడా ఎదురుచూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూసుంటే.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.
ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది మీరే కాబట్టి.. ఆ నిధులన్ని ఏం చేశారో చెప్పాలన్నారు. 12శాతం వడ్డీలకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఆగం చేసిందని మండిపడ్డారు. ఈ రోజు వరకు కూడా జనం వారిని అధికారంలోంచి తరిమేశారన్న వాస్తవాన్ని గ్రహించకపోగా ఇప్పటికి జనమే వారికి ఓట్లు వేయకుండా తప్పు చేశారన్నట్లుగా కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఇంకా ఆయన మారలేదని తేలిపోతుందన్నారు. పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించడం వెనుక తప్పేంటి.. ఒప్పేంటి అనే దానిపై ఫామ్ హౌస్ లో ఇంతకాలం సమీక్ష చేసుకుని వాస్తవాలను గ్రహిస్తారనుకుంటే అలాంటి దిద్దుబాటు విధానం కేసీఆర్ లో కనిపించడం లేదన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 100సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎందుకు పెట్టలేదో ముందు కేసీఆర్ ప్రశ్నించుకోవాలన్నారు. అఖిలపక్ష ఎంపీల సమావేశాలకు సైతం బీఆర్ఎస్ డుమ్మా కొట్టిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 28అంశాలకు సంబంధించిన నిధులు, అనుమతులపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ఎంపీల సమావేశం పెడితే బీఆర్ఎస్, బీజేపీలు డుమ్మా కొట్టారన్నారు.
వాటిపై కాంగ్రెస్ ఎంపీలుగా మేం రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేందాన్ని నిలదీస్తామన్నారు. ఆయా అంశాలపై వినతులు ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి 35 సార్లు పోయారని చామల స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పనులకు అనుమతులు, నిధులిస్తే కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుందని..అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న బీజేపీకి ఇబ్బందికరమన్న భావనతో కేంద్రం రాష్ట్రానికి మొండిచెయ్యి చూపిస్తున్నారని చామల ఆరోపించారు.