Site icon vidhaatha

నితీశ్‌, చంద్రబాబుదే కీలక పాత్ర.. వారు ఆలోచన చేయాలి.. ఢిల్లీలో బీజేపీకి గట్టి పోటీనిచ్చామన్న ఆప్‌

న్యూఢిల్లీ : తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా తమ అభ్యర్థులు బీజేపీకి గట్టి పోటీనిచ్చారని ఆప్‌ మంగళవారం పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ప్రజలు కాషాయ పార్టీ విద్వేషపూరిత, నియతృత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేశారని అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు ఎన్డీయేకు, 370 సీట్లు బీజేపీకి వస్తాయని ఆశించిన కమలనాథుల ఆశలపై దేశ ప్రజలు నీళ్లు చల్లారు. తమకు గట్టి పట్టున్న యూపీ, రాజస్థాన్‌, హర్యానాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే.. ఢిల్లీలోని ఏడు సీట్లలోనూ బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తున్నది. మూడు సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు లక్షకుపైగా మెజార్టీతో కొనసాగుతున్నారు. ఫలితాల వెల్లడి నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సంజయ్‌సింగ్‌.. ‘దేశ ఓటర్లకు తల వంచి నమస్కరిస్తున్నాను

. ఈ రోజు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. పదేళ్ల బీజేపీ పాలతో విసిగిపోయామని, బీజేపీని అధికారం నుంచి దించి వేయాలని భావించామని ఈ ఎన్నికల ద్వారా దేశ ప్రజలు సందేశాన్ని ఇచ్చారు. ధరల పెరుగుదలతో వారు సతమతం అవుతున్నారు. బీజేపీ గో బ్యాక్‌ అంటూ ప్రజలు చెప్పిన ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటుతున్నాయి’ అని చెప్పారు. బీజేపీ సొంతగా మెజార్టీ మార్క్‌ అయిన 272 సీట్లను చేరుకోలేక పోవడాన్ని ప్రస్తావించిన సంజయ్‌సింగ్‌.. ‘ఈ ఫలితాలు బీజేపీకి, దాని నియంతృత్వ, విద్వేష రాజకీయాలకు పెద్ద గుణపాఠం. మోదీకి ఏ కాస్త నైతికత ఉన్నా.. తాను 400 సీట్ల నినాదం ఇచ్చినందుకు ప్రధాని పదవి నుంచి దిగిపోవాలి.

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ పేలవమైన ప్రదర్శన గురించి ఆప్‌ ఢిల్లీ స్టేట్‌ కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ మాట్లాడుతూ.. ‘మేం ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య పోటీ చేశాం. పంజాబ్‌లో మా ఎంపీల సంఖ్య పెరుగుతుంది. ఢిల్లీలో మేం బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాం. 2019తో పోల్చితే ఈసారి బీజేపీ మెజార్టీలు గణనీయంగా తగ్గాయి’ అని చెప్పారు. ప్రస్తతం జేడీయూ, టీడీపీలది కీలక పాత్ర కానున్నదని గోపాల్‌రాయ్‌ అన్నారు. వారిద్దరూ గతంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ‘చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్‌ సరైన నిర్ణయాలు తీసుకోవాలని, దేశంలో నియంతృత్వాన్ని అంతమొందించాలన్న తమ విజ్ఞప్తిని ఆలకించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇండియా కూటమి త్వరలోనే సమావేశం కానున్నదని సంజయ్‌సింగ్‌ తెలిపారు.

Exit mobile version