CM Revanth Reddy | న్యూఢిల్లీ: కోర్టు తీర్పు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి పది రోజులు చాలు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ కమిట్మెంట్ నిరూపించుకున్నాం అని..మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు. మా పోరాటం కేంద్రంపై కాబట్టి జంతర్ మంతర్ వద్ద మా గొంతు వినిపించాం అని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఆర్డినెన్స్ తెచ్చారు కాబట్టి సవరించిన ముసాయిదా గవర్నర్ కి పంపాం అని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన 42శాతం బీసీ రిజర్వేషన్ అంశంపై నిర్ణయం ఇప్పుడు ప్రధాని మోదీ చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదని భావిస్తున్నామని..రాష్ట్రపతి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అమోదించాలని..లేకపోతే రాష్ట్రపతి ప్రధాని మోదీ చేతుల్లో ఉన్నారా అదైనా చెప్పండని డిమాండ్ చేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లి అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిశారు. ఖర్గే ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. బీజీ రిజర్వేషన్ బిల్లు అంశంపై పార్లమెంటులో చర్చ..ఆమోదానికి చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, సితక్క, కొండ సురేఖ, పొంగులేటి, జూపల్లి కృష్ణరావులు పాల్గొన్నారు.