సొంత జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డికి వరుస షాక్‌లు..నిన్న ఎమ్మెల్సీ, నేడు లోకసభ

సీఎం రేవంత్‌రెడ్డికి సొంత మహాబూబ్‌నగర్‌ జిల్లాలో వరుసగా రెండు ఓటములు ఎదురవ్వడం షాక్‌గా తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి మరువక ముందే మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్‌ ఓటమి చెందడం రేవంత్‌ రెడ్డికి మింగుపడని పరిణామమేనంటున్నారు విశ్లేషకులు

  • Publish Date - June 4, 2024 / 07:12 PM IST

విధాత : సీఎం రేవంత్‌రెడ్డికి సొంత మహాబూబ్‌నగర్‌ జిల్లాలో వరుసగా రెండు ఓటములు ఎదురవ్వడం షాక్‌గా తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి మరువక ముందే మహబూబ్‌నగర్‌ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్‌ ఓటమి చెందడం రేవంత్‌ రెడ్డికి మింగుపడని పరిణామమేనంటున్నారు విశ్లేషకులు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కాంగ్రెస్‌కు తగినంత బలం లేక ఓడామని సరిపెట్టుకున్నప్పటికి, అందరి కంటే ముందుగానే వంశీచంద్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి అన్ని తానై ప్రచారం నడిపించిన మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి రేవంత్‌ రెడ్డికి షాక్‌లా తగిలింది. ఇది చాలదన్నట్లుగా
తను సీఎం కాకముందు 2019ఎన్నికల్లో గెలిచి సిటింగ్‌ ఎంపీగా ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలోనూ తాను తెచ్చిపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునితామహేందర్‌రెడ్డి ఓటమి చెందడం రేవంత్‌రెడ్డికి నిరాశనే మిగిల్చింది. మహబూబ్‌నగర్‌, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను గెలవడం సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండింటిలోనూ కాంగ్రెస్‌ విజయంపై రేవంత్‌రెడ్డి గట్టి ధీమాతో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నందునా కాంగ్రెస్‌ పార్టీ కనీసం 12నుండి 14స్థానాల్లో గెలుస్తుందని రేవంత్‌రెడ్డి భావించారు.

అందుకు భిన్నంగా కేవలం 8సీట్లకే కాంగ్రెస్‌ పరిమితమైంది. 2019ఎన్నికలతో పోల్చితే 3 సీట్ల నుంచి 8సీట్లకు పెరిగినప్పటికి రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు సంతృప్తినిచ్చేవి కావంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేయడం, మోడీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్ధు చేస్తారని విస్తృత ప్రచారం చేసినప్పటికి బీజేపీ పార్టీకి బ్రేక్‌లు వేయలేకపోయారు. అదిగాక లోక్‌ సభ ఎన్నికలు తన పాలనకు రెఫరెండమ్‌ అని ఒక దశలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించిన ఫలితాలు రేవంత్‌రెడ్డికి నిరాశను కల్గించేవిగానే ఉన్నాయంటున్నారు. ఇక నేడు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోతే సీఎం రేవంత్‌కు మరింత అసంతృప్తి తప్పదు. 30వేల ఉద్యోగాలిచ్చామని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, డీఎస్పీ ప్రకటించామని ప్రచారం చేసినప్పటికి ఆశించిన విజయం దక్కకపోతే మాత్రం రేవంత్‌కు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిరాశ మిగల్చక మానదు.

Latest News