HCA Scam | ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి సస్పెన్షన్

HCA Scam | నిందితులకు ఆరు రోజుల కస్టడీ

విధాత, హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ సీఐ ఎలక్షన్ రెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సీఐడీ సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు సస్పెన్షన్ తో పాటు సీపీ ఆఫీసు కు అటాచ్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్, సీఐడీ విచారణలో ఎలక్షన్ రెడ్డి తలదూర్చారు. సీఐడీ విచారణ పురోగతిని సమాచారాన్నిఎలక్షన్ రెడ్డి ఎప్పటికప్పుడు కేసులో నిందితుడిగా ఉన్నహెచ్ సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజుకు ముందుగానే చేరవేశాడని గుర్తించారు. దేవరాజు అరెస్టుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు.

హెచ్‌సీఏ అవకతవకలపై సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్, రాజేందర్ యాదవ్, కవితలను ఆరు రోజుల పాటు సీఐడీ కస్టడీకి మల్కాజిగిరి కోర్టు అనుమతించింది. వారిని సీఐడీ కస్టడీలోకి తీసుకోనుంది. నేటి నుంచి ఈ నెల 22 వరకు వారిని అధికారులు విచారించనున్నారు. నలుగురు నిందితులను చర్లపల్లి జైలు నుంచి, కవితను చంచల్‌గూడ జైలు నుంచి సీఐడీ కస్టడీకి తీసుకోనుంది. వీరిని విచారిస్తే హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.