విధాత, హైదరాబాద్ : ఏపీలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి నారాయణ ఈ స్కామ్ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశముందని సమాచారం. సీఐడీ విచారణతోనే అసలు సూత్రధారులు ఎవరనే అంశం వెలుగులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలు చోటుచేసుకున్నాయి. తణుకులో కుంభకోణం జరిగిన తీరును సీఎంకు మంత్రి వివరించారు. ఆ మున్సిపాలిటీలో రూ.754కోట్ల మేర బాండ్లు జారీ చేసినట్లు పురపాలకశాఖ, ఏసీబీ గుర్తించాయి. దీనిలో మొత్తం రూ.691కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ అంశం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో లెక్కించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎకరా రూ.5లక్షలకు సేకరించి.. బాండ్ల జారీకి రూ.10కోట్లు చూపడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గుర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2019-24 మధ్య జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై అంతర్గతంగా విచారణ కొనసాగుతుంది.