AP | రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు.. 7 రెవెన్యూ డివిజన్లు!

ఆంధ్రప్రేదేశ్ లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు మరో ఏడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

విధాత :

ఆంధ్రప్రేదేశ్ లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు మరో ఏడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రి వర్గ ఉపసంఘం ఓకే చెప్పింది. అలాగే ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో.. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్టా జిల్లాలో చేర్చేందు క్యాబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. గూడురు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టి క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇక పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు 7 డివిజన్లు తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 77 రెవెన్యూ డివిజన్లను మరో 7 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. నక్కపల్లి, అద్దంకి, మడకశి, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు, బనగానపల్లెతో పాటు మరిన్ని కొత్త డివిజన్లను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చాయి. ప్రసుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ఐదు మండలాలలో రెవెన్యూ డివిజన్ గా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక బనగాన‌పల్లె ను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపాదించిన ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి.

అలాగే, కృష్ణా జిల్లా నుంచి అవనిగడ్డను డివిజన్‌ చేయాలనే ప్రతిపానలు మంత్రివర్గ ఉప సంఘం ముందుకు వచ్చాయి. చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుచేసి అభివృద్ధి చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలను రెడీ చేస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ డివిజన్ల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. దీంతో వీటిని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు గతంలోన వచ్చాయి. అయితే, గిరిజన ప్రాంతంతో మైదాన ప్రాంతాన్ని కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఈ రెండు రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసేందుకు కూడా పరీశీలిస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ ముందున్న ఈ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులు ఉంటే చేసిన తరువాత తుది నిర్ణయం వెలువడనుంది.