Cyclone Montha | మొంథా తుఫాన్ అలర్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన..!

మొంథా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల కొన్ని గంటల్లో తుఫాన్ తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో మరింత ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చిరిస్తున్నారు.

Cyclone Montha

విధాత, తెలంగాణ :

మొంథా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల కొన్ని గంటల్లో తుఫాన్ తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో మరింత ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చిరిస్తున్నారు. మొంథా తుఫాను ఉత్తర, వాయువ్య దిశలో కదులుతూ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకు సమీపంలో మంగళవారా రాత్రి సమయానికి తీరం దాటే అవకాశం ఉంది. తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని, దీంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ లోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్లగొండ , యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమరం భీం, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ 15 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే, బుధవారం తెలంగాణ లోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఈ క్రమంలో రేపు 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగాం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు తెలంగాణ లోని దాదాపు అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది.