Kingdom (2025) Review | యువతలో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్ ఎపిక్ ‘కింగ్‌డమ్’ విడుదలైంది. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ సినిమాలతో భావోద్వేగపు కథనానికి పెట్టింది పేరు సంపాదించుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘కింగ్‌డమ్’ ఆ అంచనాలకు తగిన విధంగా నిలబడిందా..?
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలలో అత్యంత ఖరీదైనది, విపరీతమైన అంచనాలతో విడుదలైంది ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, విజువల్ ప్రెజెంటేషన్, భావోద్వేగ బలం, నటన, సంగీతం – అన్నింటిలోనూ ఉన్నత స్థాయిని చేరుకునే ప్రయత్నం చేసింది. విజయ్ దేవరకొండ గతంలో ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’ వంటి సినిమాలతో విజయాల పరంపర సాధించినా, ఇటీవల వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపిన సమయంలో వచ్చిన ఈ చిత్రం నిజంగా అతని పునరాగమనం అని చెప్పాల్సిందే. ఒక కానిస్టేబుల్‌గా విధి నిర్వహణలో భాగంగా శ్రీలంకకు వెళ్లిన సూరి అనే వ్యక్తి, అక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను వెతికే ప్రక్రియలో తన చిన్నతనంలో విడిపోయిన అన్న శివనే తాను వెతికే వ్యక్తి అని తెలుసుకోవడం నుంచి కథ ప్రారంభమవుతుంది. అన్నదమ్ముల మధ్య బంధం, వ్యవస్థతో వారి పోరాటం, గిరిజనుల హక్కుల కోసం నడిచే యుద్ధం కథను నడిపిస్తాయి. మొదటి సన్నివేశం నుంచే సినిమాకుభావోద్వేగ బలాన్నినిర్మించిన దర్శకుడు, కథను ఆ మేరకు నడిపించడంలో సఫలమయ్యాడు.
సినిమా మొదటి భాగం వేగంగా, ఉత్సాహభరితంగా సాగుతుంది. అద్భుతమైన విజువల్స్‌తో పాటు, కథలోని ప్రధానపాత్రలకు బలమైన నేపథ్యాలు ఇవ్వడం దర్శకుడి నైపుణ్యాన్నిసూచిస్తుంది. 1920ల కాలపు గిరిజన పోరాటం నుంచి నేటి రాజకీయ కుతంత్రాల వరకూ ముడిపడిన కథ కథానాయకుడి చేతల్లో మాత్రమే కాదు,చుట్టుపక్కల ప్రపంచంలోని పాత్రల పట్ల ఉన్న బాధ్యతలలోనూ కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ తన గత చిత్రం ‘లైగర్’ కోసం శరీరాన్నిధృఢంగా మార్చుకున్నా, ఈ సినిమాలో అతని నటన శక్తివంతంగా సాగింది. హావభావాలతో మాత్రమే నటించాల్సిన దృశ్యాల్లో విజయ్ నటన మంచి పరిణితి సాధించింది. సాధారణంగా ఆవేశ సన్నివేశాలతోనే కనిపించే విజయ్, ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చాడు. ముఖ్యంగా అడవిలో జరిగే ఛేజ్ సీన్, గంభీరమైన నేపథ్యసంగీతంతో కలసిమంచి అనుభూతిని మిగిల్చింది. అతనితో పాటు సత్యదేవ్ కూడా నటనాపరంగా తనదైన ముద్ర వేశాడు. అతని పాత్ర కథలో సమాన ప్రాధాన్యం కలిగి ఉండడం, హీరోను ఎదిరించేందుకు కాకుండా కథకు ఓ మూల స్థంభంగా నిలవడం గొప్ప విషయం. ఆ పాత్రకు నూటికి నూరుపాళ్లు సత్యదేవ్ న్యాయం చేసాడు.
అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది. తమిళ సినిమాల్లోలాగా అవసరం లేకపోయినా ఎలివేషన్ కోసం మ్యూజిక్ వినిపించకుండా, అవసరమైన చోట మాత్రమే సంగీతాన్ని ప్రయోగించడంలో ఆయన నైపుణ్యం స్పష్టమవుతుంది. నవీన్ నూలికూడా ఫ్లో తప్పకుండామంచి ఎడిటింగ్‌తో సహాయపడ్డాడు. మలయాళ నటుడు వెంకటేశ్ నటించిన ప్రతినాయక పాత్ర విశేషంగా ఆకర్షించింది. అతని హావభావాలు, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరిస్తాయి.భాగ్యశ్రీ బోర్సే పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా, ఆమె అందం పాత్రకు అనుగుణంగానిలిచింది. రోనిత్ కామ్రా వంటి బాలనటుడికి చిన్నప్పటి సన్నివేశాల్లో ఇచ్చిన ప్రాధాన్యత కూడా మరిచిపోలేం.
అయితే చిత్రానికి ఉన్న ఇన్ని బలాల మధ్యలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. కథ విషయానికొస్తే అది కొత్తదేమీ కాదు. అనేక సినిమాల్లో చూస్తున్న అంశాలు, బంధాలు, ఫ్లాష్‌బ్యాక్ ఫార్ములాలు ఇందులో కూడా ఉన్నాయి. రెండో భాగంలో సినిమా కొంత ఊపు కోల్పోయినట్లు, కొన్ని సందర్భాల్లో సాగదీసినట్టు అనిపించడంతో పాటు, చివర్లో వాయిస్ ఓవర్ ఆధారంగా క్లైమాక్స్ చూపించటం కొంత ఇబ్బందిగా ఉంది. కానీ మొదటి భాగంలో జాగ్రత్తగా నిర్మించిన భావోద్వేగ బంధం, సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న ప్రెజెంటేషన్ ఈ లోపాలను మరచిపించేలా చేస్తాయి. ముఖ్యంగా కథను వినిపించకుండా, చూపించేందుకు ప్రయత్నించిన గౌతమ్ తిన్ననూరి టేకింగ్ ప్రశంసనీయం. ఇది పూర్తిగా కథా బలం మీద ఆధారపడిన ఈ చిత్రం, రకరకాల భావోద్వేగాల సమ్మిళిత కథనంగా ఉండి, ప్రేక్షకులను సినిమా నుండి దృష్టి మరల్చకుండా చేసింది.
ఈ సినిమా విజయ్ దేవరకొండకుగ్రాండ్ రీ ఎంట్రీఇచ్చిందనడంలో ఎలాంటిసందేహం లేదు. అభిమానులు ఎదురుచూస్తున్న సరికొత్త ‘రౌడీ’ ఈ సినిమాలో ప్రత్యక్షమయ్యాడు. ‘కింగ్‌డమ్’ ఒక పక్క యాక్షన్‌తో, మరో పక్క లోతైన భావోద్వేగాలతో కూడిన చిత్రంగా నిలిచి, మాస్ కమర్షియల్ సినిమాలకు కొత్త రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఖచ్చితంగా ఇదొక మంచి మలుపుగా నిలుస్తుంది.
‘విధాత’రేటింగ్:★★★☆☆(3/5)