Chinna Movie Review | సిద్ధార్థ్‌ చిన్నా సినిమా రివ్యూ.. మంచి మెసేజ్ ఉంది.. పేరెంట్స్‌ డోంట్ మిస్..

మూవీ పేరు: ‘చిన్నా’

విడుదల తేదీ: 06 అక్టోబర్, 2023

నటీనటులు: సిద్ధార్థ్, నిమిషా సజయన్, సహస్ర శ్రీ, సబియా తస్నీమ్, అంజలి నాయర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: బాలాజీ సుబ్రహ్మణ్యం

ఎడిటింగ్: సురేష్ ఏ ప్రసాద్

సంగీతం: దిబు నైనన్ థామస్, విశాల్ చంద్రశేఖర్

నిర్మాత: సిద్ధార్థ్

రచన, దర్శకత్వం: SU అరుణ్ కుమార్

హీరో సిద్ధార్థ్ అంటే అందరికీ లవర్ బాయ్‌గానే పరిచయం. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూకుడు చూపించిన సిద్ధార్థ్‌కు ఈ మధ్యకాలంలో సరైన సినిమా, సరైన హిట్ లేదనే విషయం తెలియంది కాదు. ప్రస్తుతం ఆ అదితిరావ్ హైదరితో రిలేషన్ నడుపుతున్నాడనే న్యూస్‌తో తప్ప.. సిద్ధార్థ్ పేరు ఇండస్ట్రీలో వినిపించను కూడా వినిపించడం లేదు. అంతగా ఆయన పరిస్థితి మారిపోయింది. అయినా సరే.. తనకి వచ్చిన యాక్టింగ్‌ని వదలకుండా.. టైమ్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. హిట్, ఫ్లాప్ సంగతి పక్కన పెడితే.. సినిమాలైతే సిద్ధార్థ్ చేస్తూనే ఉన్నాడు కానీ.. ఒక్కటీ అతనికి పూర్వ వైభవాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా చిత్రం ‘చిన్నా’. ఇప్పటికే ఇతర భాషలలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.


ఈ సినిమా విషయంలో సిద్ధార్థ్‌ చాలా అవమానాలను కూడా ఫేస్ చేసినట్లుగా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చాడు. తెలుగులో కూడా ఈ సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ సింపతీ ఎపిసోడ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన ఎన్ని చేసినా.. సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం అతనికీ తెలుసు. కాకపోతే.. కాస్త ఎమోషనల్ టచ్‌తో సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేయాలనే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీనే ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కావాలి. కానీ, డిస్ట్రిబ్యూషన్ సమస్యతో వాయిదా పడింది. ఇక రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయిన తీరు, ఇతర భాషలలో ఈ సినిమాకు వస్తున్న టాక్.. ఇవన్నీ ‘చిన్నా’ సినిమా గురించి ఆలోచించేలా చేశాయి. మరి ఆ ఆలోచనలో ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించే కంటెంట్ ఇందులో ఉందా? అసలు ‘చిన్నా’లో ఉన్న మ్యాటర్ ఏమిటనేది.. మన రివ్యూలో తెలుసుకుందాం.


 కథ:


ఈ కథలోని పాయింట్ ఆ మధ్య వచ్చిన ‘గార్గి’, ‘లవ్ స్టోరీ’ చిత్రాలకు రిలేటివ్‌గా ఉంటుంది. కొన్ని థ్రిల్లింగ్ అంశాలను, సెన్సిటివ్ అంశాలను జోడించి దర్శకుడు కథను చక్కగా రాసుకున్నాడు. ఈశ్వర్‌ (సిద్ధార్థ్)ని అందరూ చిన్నా అని పిలుస్తుంటారు. మున్సిపాలిటిలో పని చేస్తుంటాడు చిన్నా. అన్నయ్య చనిపోవడంతో వదిన, వారికున్న 8 ఏళ్ల కూతురు చిట్టి (సహస్రశ్రీ) బాధ్యతలను తీసుకున్న చిన్నా.. తన ఉద్యోగంతో ఇంటిని బాగానే లాక్కొస్తుంటాడు. చిట్టి అంటే చిన్నాకు ప్రాణం. చిన్నా అంటే కూడా చిట్టికి అంతే ప్రాణం. తనని స్కూల్‌కి తీసుకెళ్లడం, అటుపై ఆఫీస్‌కి వెళ్లడం.. మళ్లీ వస్తూ చిట్టిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం.. ఇది చిన్న డైలీ దినచర్య.


ఇలా సాగిపోతున్న చిన్నా జీవితంలోకి కాలేజీ రోజుల్లో పరిచయం ఉన్న శక్తి (నిమిషా సజయన్) కూడా మున్సిపాలిటిలో పని చేయడానికి చేరుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అదే సమయంలో చిట్టి స్నేహితురాలైన మున్నిపై లైంగిక దాడి జరుగుతుంది. ఆ దాడి చేసింది చిన్నానే అనేలా ఓ వీడియో మున్ని పేరేంట్స్‌కి దొరుకుతుంది. ఈ సమస్యతో సతమతమవుతోన్న సమయంలోనే చిట్టి కూడా కిడ్నాప్ అవుతుంది. అసలు మున్నిపై లైంగిక దాడి చేసింది ఎవరు? అలాగే చిట్టి కిడ్నాప్‌కి కారణం ఏమిటి? ఊరి చివర దొరికిన సగం కాలిపోయిన పాప శవం ఎవరిది? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే ఈ చిన్నా కథ.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

నిజంగా ఈ సినిమాలో ఈశ్వర్ పాత్ర చేసిన సిద్ధార్థ్‌ని అభినందించాలి. హీరోయిజం జోలికి వెళ్లకుండా.. చాలా సహజంగా ఇందులో అతని నటన ఉంది. ఎంత సెటిల్డ్‌గా అతను నటించాడంటే.. నిజంగా ఈ పాత్ర చేసింది సిద్ధార్థేనా? అని అంతా ఆశ్చర్యపోతారు. ఎమోషన్స్ చక్కగా పండించాడు. అతని పాత్రే ఈ సినిమాకు హైలెట్. సిద్ధార్థ్‌కు మంచి ఇమేజ్ తెచ్చే సినిమా ఇది. అలాగే ఈ సినిమా నలుగురికి చేరితే.. మంచి హిట్ కూడా సిద్ధార్థ్ ఖాతాలో పడుతుంది. హీరోయిన్‌గా చేసిన నిమిషా కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో తన కోణంలో రివీలయ్యే అంశాలు, ఆ అంశాలకు సంబంధించి తను నటించిన నటనకు జనాలు ఫిదా అవుతారు. ఆమె పాత్రకు కూడా దర్శకుడు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈశ్వర్ వదినగా చేసిన అంజలి నాయర్, సిద్ధార్థ్ స్నేహితుడుగా చేసిన ఎస్సై వారి పాత్రల పరిధిమేర చేస్తే.. ఇద్దరు పాపలు సహస్ర, సబియాల పాత్రలు ఆడ బిడ్డలు ఉన్న వారిని అలెర్ట్ చేసే విధంగా ఉంటాయి. ఆ పాత్రలలో ఇద్దరు పాపలు జీవించేశారు. ముఖ్యంగా సహస్ర పాత్రకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. సెకండాఫ్‌‌లో ఎక్కువ భాగం ఆ పాప గురించే ఉంటుంది. కంటతడి పెట్టించే నటనను ఆ పాప కనబరిచింది. ఇంకా ఇతర పాత్రలలో చేసిన వారంతా వారి పాత్రల పరిధిమేర ఈ సినిమాకు హెల్ప్ అయ్యారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..


విశాల్ చంద్రశేఖర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ప్రేక్షకులని సినిమాలోకి లీనమయ్యేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. ఒక నగరంలో తీసిన సినిమా ఇది. ఫారెన్‌లో పాటలు వంటివి ఏమీ ఉండవు. కథకు ఏ కలర్ టోన్ కావాలో.. అలాంటి కలర్ టోన్‌ని కెమెరామ్యాన్ ఉపయోగించారు. ఎడిటింగ్ పరంగా.. సెకండాఫ్‌లో సినిమా చాలా స్లోగా నడిచినట్లుగా అనిపిస్తుంది. కొన్ని అక్కరలేని సీన్లు కూడా ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టి ఉండవచ్చు. వల్గారిటీకి ఛాన్స్ ఉన్నా కూడా.. డైలాగ్స్ విషయంలో కానీ, ఇతరత్రా విషయాల్లో ఎక్కడా దర్శకుడు ఛాన్స్ తీసుకోలేదు. అందుకే రియలిస్టిక్ ఫీల్ ఇవ్వగలిగాడు దర్శకుడు.


 విశ్లేషణ:


సినిమా విశ్లేషణలోకి వెళ్లేముందు సినిమా, అందులోని కంటెంట్ గురించి చెప్పాలంటే.. ఖచ్చితంగా ఇటువంటి సినిమా ఇప్పుడవసరం ఉంది. ఫోన్స్‌కి పిల్లలు ఎలా ఎడిక్ట్ అయిపోతున్నారో.. తద్వారా జరిగే పరిణామాలు ఇందులో దర్శకుడు చూపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలా సున్నితమైన అంశాన్ని దర్శకుడు తీసుకున్నా.. ఎక్కడా శృతి మించలేదు. బహుశా.. ఈ సినిమాను తల్లిదండ్రులు, చిన్న పిల్లలు, వయసుకి వచ్చిన వారు చూస్తారని, చూడాలని తీసిన సినిమాలా అనిపిస్తుంది. చక్కని సందేశాన్ని, ఆర్టిస్ట్‌ల మధ్య సంఘర్షణను దర్శకుడు రాబట్టాడు. ఇంకా చెప్పాలంటే.. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలపై లైంగిక దాడులు ఎలా జరుగుతున్నాయనేది ఇందులో చక్కగా చూపించాడు. ఎక్కడా సినిమాటిక్ లిబర్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. సహజంగా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. ఎంతో జాగ్రత్తగా ఉండాలో చెప్పే ప్రయత్నంగా ఈ సినిమాని చూడొచ్చు.



చిన్నపిల్లల విషయంలో ‘గార్గి’ సినిమాను, కాస్త వయసుకు వచ్చిన వారి విషయంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ఓ పాయింట్‌ని ఈ సినిమాలో మరోసారి చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇదేం కొత్త కథ కాదు.. కానీ అందరూ తెలుసుకోవాల్సిన మెసేజ్ ఇందులో ఉంది. చూసే వారిలో కొందరు మనకి సంబంధించినది కాదులే.. అని అనుకోవడానికీ లేదు.. ఎందుకంటే.. రేపు నీ వరకు ఇలాంటి సమస్య రావచ్చు. ఏ పాపం చేయకపోయినా.. నింద మోయాల్సి రావచ్చు. కాబట్టి ఏ కోణంలోనూ ఈ సినిమాను చూడొద్దని చెప్పలేం. ముఖ్యంగా ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇది.



చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి నేర్పాలని అంటుంటారు కదా.. అలాంటి సినిమా ఇది. హీరోయిన్ శక్తి రూపంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు.. బాధితులు ఏం కోరుకుంటారనే విషయాన్ని చెప్పిన తీరుకి దర్శకుడిని అభినందించకుండా ఉండలేం. ఒక్కమాటలో చెప్పాలంటే.. వల్గారిటీకి తావు లేకుండా.. ఇలాంటి కథ చెప్పడం సాహసమనే చెప్పుకోవాలి. కానీ దర్శకుడు ఆ సాహసాన్ని చేసి చూపించాడు. కథలో నిజాయితీ, కథనంలో రియాలిటీ ఉన్న సినిమా ఇది. కాస్త ప్రమోషన్స్ దృష్టి పెట్టి ప్రేక్షకులలోకి తీసుకు వెళ్లగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇది అవార్డ్ ఫిల్మ్ అవుతుంది. ఫైనల్‌గా అయితే.. చిన్న చిన్న పొరబాట్లు ఉన్నప్పటికీ.. సిద్ధార్థ్ నిజాయితీగా చెప్పిన ఈ సినిమాని అంతా తప్పకుండా చూడాలి.. చూడాల్సిన అవసరం ఉంది.


ట్యాగ్‌లైన్: మంచి మెసేజ్ ఉంది.. డోంట్ మిస్..

రేటింగ్: 3/5

Latest News